మనుషుల నుంచి జంతువులకు కరోనా: అమెరికాలో 10 వేల మింక్స్ మృత్యువాత..
కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. అయితే వైరస్ మనుషుల నుంచి జనానికే వస్తున్నట్టు విన్నాం.. చూశాం... అయితే అమెరికాలో 10 వేల మింక్స్ చనిపోయాయనే అంశం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో బొచ్చు కోసం ఫారాల్లో మింక్స్ పెంచుతుంటారు. వీటికి మనుషుల ద్వారా కరోనా వైరస్ సోకి ఉంటుందని పశు వైద్యులు చెబుతున్నారు.

10 వేల మింక్స్ మృతి
ఉటా ఫార్మ్స్‌లో 8 వేల మింక్స్, విస్కాన్సిన్‌లో 2 వేల మింక్స్ చనిపోయాయి. వీటికి మనుషుల ద్వారా కరోనా వైరస్ సోకి ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. ఈ ఫారాల్లో పని చేసే సిబ్బందికి జూలైలో జర్వం వచ్చింది. కరోనా పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆగస్టు నెలలో మింక్స్ జంతువుల్లో కరోనాను గుర్తించినట్లు ఉటా రాష్ట్ర పశువైద్యాధికారి డాక్టర్ డీన్ టేలర్ తెలిపారు. మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్ వ్యాపించిందని ప్రాథమిక పరిశోధనల్లో తేలిందన్నారు.

మనుషుల నుంచి జంతువులకు..
మనుషుల నుంచి కరోనా వైరస్ జంతువులకు సోకిందని ప్రాథమిక నిర్ధారణ అయ్యింది. కానీ జంతువుల నుంచి వైరస్ మనుషులకు వ్యాపించినట్టు తేలలేదు. ఈ విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండు ఫార్మ్స్ క్వారంటైన్ చేశామని టేలర్ తెలియజేశారు. ఇదివరకు నెదర్లాండ్స్, స్పెయిన్, డెన్మార్క్‌లలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.

కరోనా సోకింది వీటికే
ఇప్పటి వరకు పదుల సంఖ్యలో కుక్కలు, పిల్లులు, ఒక సింహం, ఒక పులికి కరోనా సోకినట్లు అమెరికా నేషనల్ వెటర్నరీ సర్వీసెస్ లాబొరేటరీస్ పేర్కొంది. కరోనా వైరస్ సోకితే మనుషుల ఎలా ఇబ్బంది పడతారో.. మింక్స్ కూడా శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడ్డాయని తెలిపారు. ఉటాలోని 9 ఫార్మ్స్‌కు వ్యాపించాయని.. అందుకోసమే క్వారంటైన్ చేశామని తెలిపారు.

60 వేల మింక్స్ చంపేశారు..
నెదర్లాండ్స్‌లో కొన్ని మింక్స్‌కు జూన్ నెలలో కరోనా వైరస్ నిర్దారణ అయ్యింది. దీంతో మొత్తం 60 వేల మింక్స్‌ను చంపేశారు. ఇందులో 10 వేల పెద్దవి కాగా.. 50 వేలు చిన్నవి ఉన్నాయి. వీటి ద్వారా మనుషులకు వైరస్ సోకుతుందోనని చంపేశారు.