వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘స్త్రీ, పురుష జననేంద్రియాలతో పుట్టాను.. ఇప్పుడు మహిళగా మారాను.. దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మలేషియాకు చెందిన కాస్మెటిక్స్ వ్యాపారవేత్త నూర్ సజత్ కమరుజ్జమాన్‌ ను థాయ్ ఇమిగ్రేషన్ అధికారులు బ్యాంకాక్‌లో అరెస్ట్ చేసినట్లు సెప్టెంబర్ నెలలో వార్తలు వచ్చాయి.

36 ఏళ్ల నూర్ సజత్‌ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నూర్‌ ను అరెస్ట్ చేసిన వెంటనే మలేషియన్ అధికారులు స్పందించి, ఆమెను తమకు అప్పగించాలని కోరారు.

ఇస్లాంను అవమానించారంటూ జనవరిలో నూర్ సజత్‌ పై కేసు నమోదైంది. ఈ నేరానికి అధికంగా మూడేళ్ల జైలుశిక్ష పడొచ్చు.

నూర్ చేసిన నేరం ఏమిటంటే మలాయ్ స్త్రీల సంప్రదాయ డ్రెస్ బాజూ కురుంగ్‌ ను ధరించడమే. 2018లో నూర్ ఏర్పాటు చేసిన ఓ మతపరమైన ప్రైవేటు వేడుకలో ఆమె ఈ దుస్తులు ధరించారు.

మలేషియన్ అధికారుల దృష్టిలో నూర్ ఒక పురుషుడు. ఇస్లామిక్ చట్టం ప్రకారం పురుషులు, స్త్రీల దుస్తులు ధరించకూడదు.

వాస్తవానికి, నూర్ సజత్ ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ. ఆమెను శరణార్థిగా గుర్తించి, ఆస్ట్రేలియాలో ఆశ్రయం పొందేందుకు థాయ్‌లాండ్ అనుమతించింది. ఈ నేపథ్యంలో సిడ్నీ నుంచి ఆమె బీబీసీతో మాట్లాడారు.

మలేషియాలోని సెలంగోర్ రాష్ట్రంలో మతపరమైన వ్యవహారాల విభాగం 'జేఏఐఎస్' అధికారులు దాడి చేయడంతో పారిపోవడం తప్ప తనకు వేరే మార్గం కనిపించలేదని ఆమె చెప్పారు.

"నేను పారిపోవాల్సి వచ్చింది. నా తల్లిదండ్రులు, కుటుంబం ముందు నాతో దారుణంగా ప్రవర్తించారు. నన్ను కొట్టారు, నెట్టారు, చేతికి బేడీలు తగిలించారు. నాకు చాలా సిగ్గుగా, బాధగా అనిపించింది. నేను వారికి పూర్తిగా సహకరించాను. అయినాసరే నాతో ఇలా ప్రవర్తించారు."

"బహుశా నేను ట్రాన్స్ వుమన్ కావడం వల్లే ఇలా చేశారు అనుకుంటున్నా. నన్ను నిర్బంధించినా, కొట్టినా, తొక్కినా వారికి తప్పనిపించలేదు. మా ట్రాన్స్‌జెండర్ మహిళలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. మాకు కూడా మామూలు మనుషుల్లా జీవించే హక్కు ఉంది." అన్నారు నూర్ సజత్

హిజాబ్ ధరించిన ఫొటోలు పోస్ట్ చేయడంతో నూర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి

'జెండర్ గందగోళం'

నూర్ సజత్ సొంతంగా ఎదిగిన పారిశ్రామికవేత్త. ఏడేళ్ల క్రితం తనను తాను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం ప్రారంభించానని నూర్ చెప్పారు.

చర్మసౌందర్య, ఆరోగ్య ఉత్పత్తులను సొంతంగా డెవలప్ చేసి ఒక బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అవి విజయవంతమయ్యాయి.

సోషల్ మీడియాలో ఆమె పోస్టులు నిష్కల్మషంగా, ఉల్లాసభరితంగా ఉంటాయి. దాంతో, ఆమెకు వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఏర్పడ్డారు. జాతీయ స్థాయి సెలిబ్రిటీ అయిపోయారు.

అప్పుడే, ఆమె జెండర్ గురించి ప్రశ్నలు తలెత్తడం ప్రారంభమయ్యాయి.

నూర్ సజత్ దాన్ని ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రసిద్ధ ట్రాన్స్‌జెండర్ అందాల పోటీలో పాల్గొని, తన డాన్స్‌తో అవార్డు గెలుచుకున్నారు.

అయితే, ఆమె ముస్లిం మహిళ కావడం, ఇస్లాంను శ్రద్ధగా పాటించడం మలేషియాలో చాలామందిని ఆశ్చర్యపరిచింది.

హిజబ్ ధరించిన కొన్ని ఫొటోలు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తాను స్త్రీ, పురుష జననేంద్రియాలు రెండింటితో (ఇంటర్‌ సెక్స్‌) పుట్టానని అడిగిన వారికి నూర్ చెప్పేవారు.

జన్మతో వచ్చిన లింగాన్ని మార్చుకునేవారి కంటే ఇలా పుట్టినవారి పట్ల ఇస్లాంలో కొంత సహనం ఉంది.

2017లో తాను శారీరకంగా పూర్తిగా మహిళగా మారినట్లు నూర్ సజత్ ప్రకటిస్తూ, దానికి డాక్టర్ రిపోర్టు కూడా జత చేశారు.

దాంతో, ఆమెపై విచారణ జరపాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

ఆమె ఇంటర్‌సెక్స్‌గా జన్మించినట్లు రుజువులు కావాలని ది డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇస్లామిక్ డెవలప్‌మెంట్ 'జేఏకేఐఎం' కోరింది.

ఈ "జెండర్‌ కన్‌ఫ్యూజన్‌"లో సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా నూర్‌కు చెప్పింది.

గత ఏడాది, నూర్ సజత్ సంప్రదాయ ముస్లిం మహిళల దుస్తులు ధరించి కుటుంబంతో కలిసి మక్కా యాత్రకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆ ఫొటోలు వివాదానికి దారితీశాయి. సంప్రదాయ ముస్లింల నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇంత వివాదానికి కారణమైనందుకు తరువాత ఆమె క్షమాపణలు చెప్పారు.

కానీ, ఏడాది తిరగకుండానే ఆమెపై క్రిమినల్ కేసులు మోపారు.

"నేను మక్కాలో ఉన్నప్పుడు నాకు నేనే ఒక ప్రశ్న వేసుకున్నాను.. నేను ఇలా పుట్టడానికి ఏదైనా కారణం ఉండొచ్చా? ఒక ట్రాన్స్‌జెండర్ మహిళగా, ముస్లింగా నాకు నచ్చినట్లు నా మతం పట్ల భక్తి శ్రద్ధలను వ్యక్తపరిచే హక్కు నాకుంది. వాళ్లేదో దేవుడి పని చేస్తున్నట్లు.. నన్ను శిక్షించేందుకు వాళ్ల దగ్గర ఏ కారణం లేదు" అన్నారామె

నూర్ సజత్ కేసుపై వ్యాఖ్యానించమని మలేషియన్ రెలిజియస్ అఫైర్స్ డిపార్ట్‌మెంటును బీబీసి కోరింది. కానీ, వాళ్లు స్పందించలేదు.

"తప్పు చేశానని ఒప్పుకుంటూ, మా దగ్గరకు రావడానికి ఇష్టపడితే, తన సహజ సిద్ధమైన జెండర్‌కు మారిపోవడానికి అంగీకరిస్తే, అప్పుడు ఏ సమస్యా ఉండదు. మేం తనను శిక్షించాలని అనుకోవట్లేదు. అవగాహన కలిగించడమే మా లక్ష్యం" అని మత వ్యవహారాల మంత్రి ఇద్రిస్ అహ్మద్ సెప్టెంబర్‌లో వెల్లడించారు.

మలేషియన్ ముస్లింలకు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను అంగీకరించడం సాధ్యమేనా? అని మఫ్టీ, పెర్లిస్ రాష్ట్రంలోని సీనియర్ ఇస్లామిక్ సలహాదారు అస్రీ జైనుల్ అబిదీన్‌ను అడిగాం.

"నా దృష్టిలో సజత్ కేసు ప్రత్యేకమైంది. మతపరమైన అధికారులను రెచ్చగొట్టే విధంగా సజత్ చాలా పనులు చేశారు. సాధారణంగా ఇస్లాంలో వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోం. అది మీకు, భగవంతునికి మధ్య విషయం. కానీ ఇలాంటి పాపాలను మనం ఎప్పుడూ గుర్తించం. మీరు మాత్రమే మిమ్మల్ని మహిళగా భావిస్తూ, మహిళల టాయిలెట్లోకి వెళ్లాలనుకుంటే.. అది సాధ్యం కాదు" అన్నారాయన.

సంప్రదాయ మలాయ్ ముస్లింల ఓట్ల కోసం రాజకీయ నాయకులు వారి డిమాండ్లకు తలొగ్గుతారు

'ఇస్లామీకరణ' దిశగా అడుగులు

మలేషియాలో రెండు రకాల చట్టాలు ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇస్లామిక్ షరియా చట్టం అమలులో ఉంది. ఈ రాష్ట్రాల్లో 60 శాతం జనాభా ముస్లింలే.

దీనివల్ల ఎల్జీబీటీ గ్రూపులు నిత్యం సమస్యలు ఎదుర్కుంటూనే ఉంటాయి.

"ప్రతీ రాష్ట్రంలోనూ షరియా చట్టం ప్రత్యేకంగా మమ్మల్ని లక్ష్యాలుగా చేసుకుంటుంది. ఈ షరియా చట్టం వల్లే మా సమాజం గురించి రాజకీయ నాయకులు, లీడర్లు, మత అధికారులు తప్పుగా మాట్లాడతారు. మాకు వ్యతిరేకంగా ప్రకటనలిస్తారు. దీనివల్ల మాకు భద్రత లేకుండా పోతోంది" అని ట్రాన్స్‌జెండర్ ప్రచారకర్త నిషా ఆయూబ్ అన్నారు. మహిళల దుస్తులు ధరించినందుకు గతంలో ఆమె కూడా జైలు పాలయ్యారు.

అయితే, గతంలో పరిస్థితులు ఇలా ఉండేవి కావు.

"నిజానికి ఒకప్పుడు మలేషియాలో ట్రాన్స్‌జెండర్ గ్రూపుల పట్ల అంగీకారం, సహనం ఉండేవి" అని రోజానా ఇసా తెలిపారు.

ఇస్లాంలో మహిళా హక్కుల పరిరక్షణ దిశగా పనిచేసే 'సిస్టర్స్ ఇన్ ఇస్లాం' సంస్థను రోజానా స్థాపించారు. నూర్ సజత్‌కు ఈ సంస్థ మద్దతిచ్చింది.

"ట్రాన్స్‌జెండర్లు కూడా అందరితోపాటు సాధారణ జీవితం గడిపేవారు. కుటుంబంతో కలిసి ఉంటూ, అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వారి పబ్లిక్ జీవితం కూడా సాఫీగా సాగేది. కానీ, గత ముప్పై యేళ్లకు పైగా మా దేశ విధాలన్నీ ఇస్లామీకరణ దిశగా సాగుతున్నాయి. కొత్త చట్టాలు, ఇస్లాంకు సరి కొత్త వ్యాఖ్యానాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఇరుకైన భావజాలాలు.. వైవిధ్యాలను అంగీకరించేవి కావు." అన్నారు రోజానా.

మలేషియాలో ఇస్లాం అధికారిక మతమే కాకుండా ఒక మలాయ్‌గా ఉండడానికి అవసరమైన లక్షణం కూడా.

ఎన్నికల్లో గెలవాలంటే సంప్రదాయ మత దృక్పథం ఉన్న మలాయ్ జాతి జనాభా మధ్య బాగా రాణించాలని రాజకీయ నాయకులకు తెలుసు.

మలాయ్ జనాభా అధికంగా ప్రాంతాల్లో ఇస్లామిక్ విలువల పరిరక్షణ మరింత కట్టుదిట్టంగా జరగాలని అక్కడి ప్రజలు కోరుకుంటారు. రాజకీయ నాయకులు కూడా వారి డిమాండ్లకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంటారు.

మలేషియా రాజకీయాల్లో ఇటీవల ఏర్పడిన కల్లోలాలు, కోవిడ్ 19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కారణంగా బలహీనపడిన ప్రభుత్వం ముస్లింల మద్దతు కూడగట్టుకోడానికి నూర్ సజత్‌ను అరెస్ట్ చేసిందని, ఇందులో మతపరమైన కారణాలు తక్కువేనని కొందరు భావిస్తున్నారు.

నూర్ సజత్ పారిశ్రామిక వేత్తగా సొంతంగా ఎదిగారు.

'చట్టాలు మారాలి'

ఎలాంటి ఇస్లామిక్ భావాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ, ట్రాన్స్‌జెండర్ హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని నిషా అయూబ్ అంటారు.

పాకిస్తాన్, ఇరాన్ లాంటి ఇతర ముస్లిం దేశాల్లో దీని కోసం చట్టాలను మార్చారని గుర్తు చేశారు.

"మైనారిటీలు కూడా వ్యవస్థలో భాగమేనని మా నాయకులు గుర్తిస్తే పరిస్థితులు మారుతాయి. ముందు చట్టాలను సంస్కరించాలి. మార్పు అక్కడ ప్రారంభం కావాలి. మా సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే చట్టాలు ఉన్నంతవరకూ ఎప్పటికీ మార్పు రాదు."

నూర్ సజత్ దత్తత తీసుకున్న బాబు, పాపల ఆలనా పాలనా మలేషియాలో ఉన్న ఆమె కుటుంబం చూసుకుంటోంది.

పిల్లల్ని బాగా మిస్ మిస్ అవుతున్నానని నూర్ చెప్పారు.

అయితే, తన అనుభవాలను ఆస్ట్రేలియాలోని ఇతర ట్రాన్స్‌జెండర్లతో పంచుకునేందుకు ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా మలుచుకున్నారు నూర్ సజత్.

"సోషల్ మీడియా విషయంలో మరింత విశాలంగా, ఉన్నతంగా ఆలోచించాలని" రోజానా ఇసా మలేషియా ప్రజలకు పిలుపునిచ్చారు.

"నూర్ సజత్‌పై ఎందుకు ఇన్ని నిందలు వేస్తున్నాం? తన పోస్టుల ద్వారా, లేదా మక్కా వెళ్లడం ద్వారా ఆమె ఎవరినీ గాయపరచలేదు. ఇతరుల వ్యవహారాలను నియంత్రించే బదులు మనల్ని మనం నియంత్రించుకోవడం ముఖ్యం" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
‘I was born with female and male genitals .. now I have become a woman .. had to flee the country’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X