గాజాపై ఇజ్రాయెల్ జెండా: మిగిలింది కొసరు మాత్రమే
ఇన్నేళ్లూ గాజాలోని హమాస్ మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు దిగుతూ వచ్చిన ఇజ్రాయెల్.. మరో అడుగు ముందుకు వేయబోతోంది. ఈ దఫా గాజను స్వాధీనం చేసుకోనుంది. ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టింది కూడా. హమాస్ మిలిటెంట్ల చెర నుంచి గాజాను విడిపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.
గాజాను టేకోవర్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సంపూర్ణ అధికారాలను ఇచ్చింది ఆ దేశ మంత్రివర్గం. ఈ మేరకు దీనికి సంబంధించిన ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆ దేశ సెక్యూరిటీ కేబినెట్ సంతకం చేసింది.

హమాస్‌ను సమూలంగా ఓడించడం, వారి చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీ పౌరులను విడిపించుకోవడం, మానవత దృక్పథం కింద అక్కడి పౌరులకు ఆహారం, మెడిసిన్, నిత్యావసర సరుకుల పంపిణీ, ఇతర సహాయ సహకారాలను అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని మంత్రిమండలి వివరించింది.
గాజా నగరాన్ని స్వాధీనపర్చుకోవడానికి ప్రధాని నెతన్యాహు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించినట్లు వివరించింది. దీంతో- ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి త్వరలోనే రంగంలోకి దిగబోతోన్నాయని అంచనావేసింది.
యుద్ధ ప్రాంతాలకు వెలుపల ఉన్న పౌరులకు మానవతా సహాయం అందించే బాధ్యతను కూడా డిపెన్స్ ఫోర్సెస్ తీసుకుంటుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ ప్రణాళికకు మెజారిటీ కేబినెట్ మంత్రులు మద్దతు పలికారు. హమాస్‌ను మట్టుబెట్టడం, వారి వద్ద బందీలుగా ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి ఇంతకంటే మరో మార్గం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది.
ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇఫ్పటివరకు 75 శాతం గాజాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించింది. మిగిలిన ప్రాంతాన్ని వశం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని తెలిపింది. దీనికోసం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పేర్కొంది.
గాజాపై దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 2,000 మంది హమాస్ మిలిటెంట్లు, ఇతర తీవ్రవాదులను అంతమొందించినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. సుమారు 10,000కు పైగా ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు జరిగాయని, హమాస్‌పై ఒత్తిడిని తీవ్రతరం చేయడంలో భాగంగా ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
అలాగే- గాజాకు సంబంధించినంత వరకు 60,000 రిజర్వ్ ఆర్డర్లు జారీ చేసింది ఐడీఎఫ్. గాజాలో దాదాపు 75 శాతం ఆపరేషనల్ కంట్రోల్ ను సాధించడం ద్వారా హమాస్ కమాండ్ చైన్‌ను పూర్తిగా బలహీనపరిచినట్టయిందని పేర్కొంది. దీన్ని మరింత విస్తరించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వివరించింది.
ఇటీవలే గాజాలో మోరాగ్, మాగెన్ ఓజ్ కంట్రోల్ కారిడార్ల ఏర్పాటు చేసింది ఐడీఎఫ్. గాజా వ్యాప్తంగా ఐడీఎఫ్ విభాగాలు ఏకకాలంలో తమ కార్యకలాపాలను మొదలు పెట్టాయి కూడా. ఇందులో భాగంగా హమాస్ మిలిటెంట్ల సొరంగాలు, ఇతర స్థావరాలను నేలమట్టం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications