ఇమ్రాన్ పదవి పోవటం ఖాయమేనా - చివరి ప్రయత్నాల్లో నిమగ్నం : 28న లాంఛనంగా..!!
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆయన పదవి నుంచి తప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా మారటంతో..ఇక, పదవి కాపాడుకొనేందుకు ఇమ్రాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. దీంతో..ఇప్పుడు ఆయన ప్రతిపక్షాలపైన గురి పెట్టారు. పాకిస్థాన్ లో నెలకొన్ని ప్రస్తుత సంక్షోభాలకు ఇమ్రాన్ వైఫల్యమే కారణంగా కొంత కాలంగా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం..ద్రవ్యోల్భణం..నిత్యావరస ధరలు..పెరిగిపోతున్న అప్పులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా మారాయి.

పొంచి ఉన్న పదవీ గండం
వీటికి ప్రధాని ఇమ్రాన్ బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన దాదాపు 100 మంది చట్టసభ సభ్యులు మార్చి 8న నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ ముందు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
జాగా ఈ తీర్మానంపై ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అధికార పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్- పీటీఐ పార్టీకి చెందిన దాదాపు 24 మంది సభ్యులు బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ 24 మంది సభ్యులు ఇస్లామాబాద్‌లోని సింధ్ హౌస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనం సింధ్ ప్రావిన్సులో అధికారం చేపట్టిన ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందింది.

చివరి ప్రయత్నాల్లో ఇమ్రాన్
ఇదే సమయంలో ప్రధాని ఇమ్రాన్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తన సొంత పార్టీకి చెందిన కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసమ్మతి నేతలు దారికి రాకుంటే..వారి పైన అనర్హత వేటు వేసే అంశం పైన న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఖాన్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న పది లక్షల మంది కార్మికులతో ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఇటు సైన్యం సైతం ఇమ్రాన్ పైన ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.
దేశంలో నెలకొన్న సంక్షోభంలో మిలిటరీ తటస్థంగా ఉంటుందంటూ ఇటీవలే పాక్ ఆర్మీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీని పైన ప్రధాని స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సమయంలో..ఈ నెల 21వ తేదీ నుంచి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి.

28న ఓటింగ్ లో తేలనున్న భవితవ్యం
ఈ నెల 28న ఓటింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 342 మంది సభ్యులున్న పాక్ పార్లమెంట్‌లో.. 172 మంది ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ పార్టీకి 155 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అతికష్టం మీద ఆరుపార్టీలకు చెందిన 23 మంది సభ్యుల మద్దతుతో 2018లో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన 24 మంది సభ్యులు బహిరంగంగానే ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. ఇమ్రాన్ తన పదవి నిలబెట్టుకోవటం కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు ఇదే రకంగా కొనసాగితే..ఇమ్రాన్ పదవి కోల్పోవటం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications