ఐరాస వేదికగా భారత్ కీలక నిర్ణయం- ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమణలతో..!!
ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి తటస్థ వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాలను తమ దేశంలో రష్యా విలీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఈ నిర్ణయాన్ని రష్యా ఉపసంహరించుకోవాలంటూ తీర్మానం ప్రతిపాదించింది. ఈ తీర్మానం వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓటింగ్ కు 143 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. భారత్ తో సహా 35 దేశాలు దూరంగా నిలిచాయి.

భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా
ఉక్రెయిన్‌కు చెందిన దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్‌ను.. తమ దేశంలో రష్యా విలీనం చేసుకోవడాన్ని ఐరాస ఖండించింది. ఆ ప్రాంతాలను ఉక్రెయిన్‌కు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేసింది. దీని పైన ప్రవేశ పెట్టిన తీర్మానం పైన ఓటింగ్ జరిగింది. మొత్తం 193 మంది సభ్యులు ఉండగా.. అనుకూలంగా 143 దేశాలు ఓటు వేశాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండడం వల్ల తీర్మానం ఆమోదం పొందింది. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరాగ్వా తీర్మానానికి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి. కాగా, ఉక్రెయిన్‌లో యుద్ధం తీవ్రతరం కావడం పట్ల భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఐరాస శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు. అంతకుముందు సోమవారం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది.

రష్యా అసంతృప్తి..మోసం అంటూ
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను మాస్కో చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండిస్తూ.. అల్బానియా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై రికార్డెడ్ ఓటింగ్ నిర్వహించాలని కోరింది. కానీ రష్యా మాత్రం ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. మాస్కో డిమాండ్‌కు వ్యతిరేకంగా భారత్ సహా 107 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఓటు వేశాయి. ఈ పరిణామాలపై ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిల్లీ నెబెన్జియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐరాస సభ్యత్వం భారీ మోసానికి చిహ్నంగా మారిందని వ్యాఖ్యానించారు. గత నెల 30న ఉక్రెయిన్‌పై సైనికచర్య సందర్భంగా స్వాధీనం చేసుకున్న దొనెత్స్క్ , లుహాన్స్క్ , జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి.

రిఫరెండం లో మద్దతు మేరకే
క్రెమ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. గత నెల 23 నుంచి 27 వరకు నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు విలీనానికి మద్దతు తెలిపినట్లు మాస్కో ప్రకటించింది. 99శాతం మంది ప్రజలు రష్యాలో విలీనానికి అనుకూలంగా ఓటేసినట్లు వెల్లడించింది. ఇటు ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిల్లీ నెబెన్జియా అసంతృప్తి వ్యకం చేస్తూ ఐరాస అధ్యక్ష స్థానంలోని వ్యక్తి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడానికి తమకు అవకాశం ఇవ్వలేదని వాలిల్లీ విమర్శించారు. సభ్యదేశాలు స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పే హక్కును దోచుకొన్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications