పాక్ కు సింధు జలాలు వెళ్లకుండా బ్రేక్..! రూ.3116 కోట్లతో కేంద్రం బిగ్ ప్లాన్..!
పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో నాలుగు దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్.. ఆ తర్వాత ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాకిస్తాన్ కు జీవనాధారం అయిన సింధు నది నీటి విషయంలో ఎవరేం చెప్పినా పట్టించోకుండా ముందుకెళ్తున్న కేంద్రానికి ఈ నీటిని పూర్తి స్ధాయిలో ఆపడం మాత్రం ఇప్పటికిప్పుడు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త వ్యూహాలు రచిస్తోంది.
ఈ నేపథ్యంలో గతంలో అంతర్జాతీయ స్ధాయిలో ఒత్తిళ్లతో పక్కనబెట్టేసిన, లేదా మందకొడిగా ముందుకు సాగుతున్న ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేస్తోంది. ఇదే క్రమంలో మరో కీలక డ్యామ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసందుకు వ్యూహరచన చేస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో చీనాబ్ నదిపై నిర్మించే కీలకమైన క్వార్ డ్యామ్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి సిద్ధవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,119 కోట్ల రుణం సేకరించబోతోంది.

గ్రీన్‌ఫీల్డ్ స్టోరేజ్ రకం ప్రాజెక్ట్ అయిన ఈ క్వార్ డ్యామ్ పనులు పూర్తయితే పాకిస్తాన్ కు ప్రవహించే సింధు నది నీటికి కొంత మేర బ్రేక్ వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఎన్.హెచ్.పి.సి లిమిటెడ్ తో పాటు జమ్మూ -కాశ్మీర్ రాష్ట్ర విద్యుత్ సంస్థ జాయింట్ వెంచర్ అయిన చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌కు రూ.3,119 కోట్ల స్వల్పకాలిక రుణం తీసుకునేందుకు వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులను సంప్రదిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.4,526 కోట్లుగా అంచనా.

ఈ ప్రాజెక్టులో ప్రధాన మైలురాయిగా భావిస్తున్న చీనాబ్ నది మళ్లింపు ప్రక్రియ గతేడాది జనవరిలోనే జరిగింది. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 609 మీటర్ల పొడవైన ప్రధాన యాక్సెస్ టన్నెల్ తవ్వకం ప్రారంభమైంది. జమ్మూ , కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ ప్రాజెక్టు ఉంది. ఇది 109 మీటర్ల ఎత్తున్న కాంక్రీట్ గ్రావిటీ ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది.












Click it and Unblock the Notifications