World Map: 500 ఏళ్ల నాటి తప్పులు సరిచేయడానికి భారత్ ఓటు
ప్రపంచపటం అనగానే మనందరికీ గుర్తుకొచ్చే పాతకాలపు మ్యాప్ డిజైన్‌కు ఐక్యరాజ్యసమితి స్వస్తి పలికేందుకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16వ శతాబ్దం నుంచి వాడుకలో ఉన్న 'మెర్కేటర్ మ్యాప్' విధానం వల్ల భూభాగాల పరిమాణాల్లో తీవ్రమైన వ్యత్యాసాలు, పొరపాట్లు జరుగుతున్నాయని గుర్తిస్తూ, 'కారెక్ట్ ది మ్యాప్' పేరిట ప్రవేశపెట్టిన విప్లవాత్మక తీర్మానానికి ఐరాస సాధారణ సభ ఆమోదం తెలిపింది. దాదాపు 164 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం విశేషం. ప్రపంచ భూభాగాల అసలు పరిమాణాన్ని ఖచ్చితత్వంతో చూపే 'ఈక్వల్-ఏరియా' విధానాలకు ప్రపంచదేశాలు జైకొట్టాయి. ఈ చారిత్రాత్మక మార్పుకు భారత్ కూడా మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మన స్కూళ్లలో, భూగోళశాస్త్రంలో ఇప్పటివరకు చూసిన పాత 'మెర్కేటర్ మ్యాప్' విధానాన్ని కేవలం నావిగేషన్ దిశల కోసం మాత్రమే రూపొందించారు. కానీ దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువాల వైపు ఉండే అమెరికా, యూరప్, గ్రీన్ లాండ్ వంటి ప్రాంతాలు అసలు వైశాల్యం కంటే విపరీతమైన పెద్దవిగా కనిపిస్తాయి.

ఉదాహరణకు, పాత మ్యాప్‌లో గ్రీన్‌లాండ్ పరిమాణం ఆఫ్రికా ఖండంతో సమానంగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆఫ్రికా ఖండం గ్రీన్‌లాండ్ కంటే ఏకంగా 14 రెట్లు పెద్దది! అలాగే అలాస్కా, బ్రెజిల్ రెండు సమాన పరిమాణంలో ఉన్నట్లు పాత మ్యాప్‌లు భ్రమింపజేస్తాయి.. కానీ నిజానికి బ్రెజిల్, అలాస్కా కంటే 5 రెట్లు పెద్ద భూభాగం. ఈ రకమైన వ్యత్యాసాలను తుడిచిపెట్టడమే ఐరాస కొత్త తీర్మానం ముఖ్య ఉద్దేశం.
భారత్ కీలక సవరణ: ఏ ఒక్క టెక్నాలజీకో పరిమితం కావొద్దు!
ఈ తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసినప్పటికీ, ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త రఘు పూరి ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేశారు. మ్యాప్‌లలో వైశాల్య లోపాలను సరిదిద్దడం మంచిదే అయినప్పటికీ, ఐరాస కేవలం 'ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్' అనే ఒక్క నిర్దిష్టమైన మ్యాపింగ్ సాంకేతికతకే పరిమితం కాకూడదని భారత్ హితవు పలికింది. "మ్యాప్‌లు ఏ విధానంలో ఉండాలనేది ఆయా దేశాలు, పరిశోధనా సంస్థలు, కార్టోగ్రాఫర్లు తమ అవసరాలకు తగ్గట్లు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలి. సాంకేతికంగా, పద్ధతుల పరంగా ఈ తీర్మానం తటస్థంగా ఉండాలని మేము భావిస్తున్నాం" అని రఘు పూరి స్పష్టం చేశారు.
అసలైన భౌగోళిక స్వరూపం.. ప్రపంచానికి కొత్త చూపు!
భారత భూభాగం, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఖండాల అసలు వైశాల్యాన్ని, సమతుల్యతను ప్రపంచానికి సరిగ్గా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత మ్యాప్‌లు సృష్టించిన భౌగోళిక పొరపాట్లను సరిదిద్దడం ద్వారా విద్యార్థులకు, పరిశోధకులకు ప్రపంచ భూభాగాల అసలు పరిమాణంపై సరైన అవగాహన ఏర్పడుతుంది. అంతర్జాతీయ వేదికపై దౌత్యపరంగా సాంకేతిక తటస్థతను కాపాడుతూనే, నిజమైన భౌగోళిక స్వరూపానికి మద్దతు తెలిపిన భారత్ వైఖరిని అంతర్జాతీయ నిపుణులు కొనియాడుతున్నారు.














Click it and Unblock the Notifications