ట్రంప్ దెబ్బకు పన్నులను భారీగా తగ్గించిన భారత్?
Trump Tariff: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్‌తో బెంబేలెత్తిస్తోన్నారు. భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవే అవన్నీ కూడా. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుకుని నిధుల నిలిపివేత వరకూ ఆయన వేసిన ప్రతి అడుగూ ప్రకంపనలను పుట్టిస్తూ వచ్చినవే.
భారత్ సహా ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ నాలుగు దేశాలపైన సరికొత్త టారిఫ్‌ను ఆయన కిందటి నెలలో ప్రకటించారు. ఈ క్రమంలో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా.

ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. తాజాగా ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు. 25 శాతం వరకు టారిఫ్ పెంచారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
ఈ పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టారిఫ్ పెంపుదలలో చాలా ఫెయిర్‌గా ఉంటామని వ్యాఖ్యానించారు. తమ మంచితనాన్ని ఇతర దేశాలు సొమ్ము చేసుకున్నాయని, ఇన్నాళ్లూ తమ ఉత్పత్తులపై భారీగా టారిఫ్ వసూలు చేశాయని గుర్తు చేశారు.
ఫలితంగా తమ దేశ ఉత్పత్తులపై టారిఫ్‌ను తగ్గించడానికి భారత్ అంగీకరించిందని ప్రకటించారు. ఏప్రిల్ 2 నుండి అమెరికా ఉత్పత్తులపై ట్యాక్సులను భారీగా తగ్గించనుందని వెల్లడించారు. రెసిప్రోకల్ (పరస్పర) విధానం కొత్త టారిఫ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీని లిబరేషన్ డేగా అభివర్ణించారు.
యూరోపియన్ యూనియన్ కూడా ఇటీవలే తమ పన్నులను తగ్గించిన విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్లపై యూరప్ దేశాలు 2.5 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. భారత్ కూడా తమ పన్నులను భారీగా తగ్గించబోతోందని కొద్దిసేపటి సమాచారం అందిందని వివరించారు.
2021 నుండి 2024 వరకు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. భారత్. 2023లో వస్తువులు, సేవల ద్వైపాక్షిక వాణిజ్యం 190.08 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అమెరికాతో 43.65 బిలియన్ల డాలర్ల మేర ఎగుమతులు- దిగుమతులు కొనసాగుతున్నాయి. 83.77 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది భారత్. అలాగే- 40.12 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.












Click it and Unblock the Notifications