గీతను మాకివ్వండి: కరాచీ కోర్టులో ఇండియన్ పిటిషన్
కరాచీ: భారత్ నుంచి తప్పిపోయి పాకిస్థాన్‌లోని కరాచీలో స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్న మూగ, చెవిటి యువతి గీతను తన సంరక్షణలోకి ఇవ్వాలని కోరుతూ భారత్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఒకరు కరాచీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ విచారించిన న్యాయస్థానం.. గీతను తీసుకొని సోమవారం తమ ముందుకు రావాలని ఆమెకు ఆశ్రయమిస్తున్న ఈదీ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అబ్దుల్ సత్తార్‌కు నోటీసులు జారీచేసింది.
2006లో సరిహద్దును దాటి కరాచీకి చేరుకున్న గీతను అబ్దుల్ సత్తార్ చేరదీయగా.. ఇటీవల ఈ అంశం విస్తృతంగా వార్తల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో గీతను తన సంరక్షణలోకి ఇవ్వాలని సామాజిక కార్యకర్త మొమిలీన్ మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు.

పాకిస్థాన్ విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఓ విమానాశ్రయంపై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. గ్వాదర్ జిల్లాలో గత 20 ఏండ్లుగా వినియోగంలోలేని జివానీ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు ఇంజినీర్లను హత్యచేశారు. మరొకరిని గాయపరిచారు.
మోటారు సైకిళ్లపై వచ్చిన 12 మంది సాయుధులైన ఉగ్రవాదులు విమానాశ్రయంలోని రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేసి అక్కడి ఇంజినీర్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడగా.. ఓ ఇంజినీర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇంజినీర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. కొద్ది గంటల తరువాత అతడు శవమై కనిపించాడు.
కాగా, భారీ మొత్తంలో చైనా పెట్టుబడులతో పోర్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంపై ఉగ్రవాదుల దాడిని బలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ మాలిక్ బలూచ్ ఖండించారు. ఈ దాడికి బలూచిస్థాన్ తిరుగుబాటుదారులే కారణమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications