సురక్షితంగా సౌదీకి చేరుకున్న భారతీయులు
రియాధ్: అంతర్యుద్ధంతో అతలాకుతలమౌతోంది సూడాన్. అధికారం కోసం రెండు సైనిక విభాగాల మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 200మందికి పైగా ప్రజల మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. రోజుల తరబడి సాగుతూ వస్తోందీ అంతర్యుద్ధం. దీన్ని నివారించడానికి ఐక్యరాజ్య సమితి స్వయంగా రంగంలోకి దిగినా పెద్దగా ఫలితాలు కనిపించలేదు.
సూడాన్‌లో నెలకొన్న పరిణామాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన సైతం వ్యక్తం చేసింది. అక్కడ నివసిస్తోన్న విదేశీయుల భద్రతపై అత్యవసర సమీక్షలనూ నిర్వహించింది. యుద్ధాన్ని నిలిపివేయాలంటూ అక్కడి సైన్యాన్ని సూచించింది. అయినప్పటికీ- అక్కడి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది యుద్ధం తీవ్రత.

ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ను సూడాన్ ఆర్మీలో విలీనం చేయడానికి సైన్యాధికారి అబ్దెల్ ఫత్తా అల్- బుర్హాన్ చేసిన ప్రతిపాదన ఈ అంతర్యుద్ధానికి దారి తీసింది. సూడాన్ అంతర్యుద్ధం, హింసాకాండలో చిక్కుకున్న భారతీయుల భద్రతపై ఆందోళనలకు వ్యక్తం అయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై ఇదివరకే అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నిర్వహించిన ఈ సమావేశంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సుడాన్‌లోని భారత రాయబారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుడాన్‌లో నెలకొన్న తాజా పరిణామాలను ప్రధాని వారిని అడిగి తెలుసుకున్నారు. సూడాన్‌లో 3,000 మందికి పైగా భారతీయులు నివసిస్తోన్నారని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఈ నేపథ్యంలో సూడాన్‌లో నివసించే భారతీయులు, ఇతర దేశస్తులను సురక్షితంగా తరలించడానికి సౌదీ అరేబియా ముందుకొచ్చింది. అక్కడి సైన్యంతో సంప్రదింపులు జరిపింది. విదేశీయులను తరలించడానికి సహరించాలంటూ విజ్ఞప్తి చేసింది. దీనికి సూడాన్ సైన్యం అంగీకరించింది. కొన్ని గంటల పాటు కాల్పుల విరమణను ప్రకటించింది. విదేశీయుల తరలింపునకు ఏర్పాట్లు చేసింది.
ఈ క్రమంలో రెడ్ సీ తీర ప్రాంతంలోని పోర్ట్ సూడాన్ నుంచి విదేశీయుల తరలింపు కార్యక్రమాలను చేపట్టింది సౌదీ అరేబియా ప్రభుత్వం. దశలవారీగా వారిని జెడ్డాకు తీసుకొచ్చింది. భారతీయులు, ఇతర దేశస్తులు, రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను సురక్షితంగా తీసుకొచ్చినట్లు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాయల్ సౌదీ నౌకాదళం సహకారంతో వారిని తీసుకొచ్చినట్లు పేర్కొంది.
ఇందులో- కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ట్యునీషియా, పాకిస్తాన్, భారత్, బల్గేరియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, కెనడా, బుర్కినా ఫాసో దేశస్తులు ఉన్నారని పేర్కొంది. వారి వారి స్వదేశాలకు సురక్షితంగా పంపించే కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపింది. మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని స్పష్టం చేసింది. త్వరలోనే వారంతా స్వదేశాలకు బయలుదేరి వెళ్తారని వివరించింది.












Click it and Unblock the Notifications