అమెరికాకు భారత్ సైలెంట్ షాక్..! ట్రంప్ కు సెనేటర్ల ఫిర్యాదు..!
గతేడాది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారనే కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఈ విషయం ముందే ఊహించిన భారత్.. అమెరికా వస్తువులపై సుంకాల్ని జీరోకు తెస్తామని ప్రతిపాదించింది. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ట్రంప్ తాను అనుకున్న పని చేసేశారు. దీనిపై భారత్ నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా ట్రంప్ కు భారీ షాకిచ్చింది.
గతంలో అమెరికా పప్పులపై జీరో సుంకాలు విధించేందుకు సిద్దమైన భారత్.. ఇప్పుడు అనూహ్యంగా ఏకంగా 30 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతే కాదు దీన్ని సైలెంట్ గా అమల్లో కూడా పెట్టేసింది. దీంతో అమెరికా వ్యాపారులపై ఒత్తిడి పెరిగింది. ఇదే విషయాన్ని తాజాగా ఇద్దరు అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తెచ్చారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అమెరికా-భారత వాణిజ్య ఒప్పందం అనిశ్చితి నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమెరికా పప్పుధాన్యాలపై భారత్ 30 శాతం సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలని ట్రంప్ కు
ఉత్తర డకోటాకు చెందిన సెనేటర్ కెవిన్ క్రామెర్, మోంటానాకు చెందిన సెనేటర్ స్టీవ్ డైన్స్ లేఖ రాశారు. ఈ దిగుమతి సుంకాన్ని తొలగించాలని భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని వీరు లేఖలో ట్రంప్ ను కోరారు. గత సంవత్సరం ట్రంప్ విధించిన శిక్షాత్మక 50% సుంకాలకు ప్రతీకారంగా దీనిని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామం అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.

గతేడాది అక్టోబర్ 30న అమెరికా పసుపు బఠానీలపై భారతదేశం 30% సుంకాన్ని విధించిందని, ఇది నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిందని ట్రంప్ కు రాసిన లేఖలో సెనేటర్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని భారత్ ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఎవరికీ తెలియలేదు. కానీ తాజాగా దాని ప్రభావం అక్కడి పప్పుధాన్యాల ఎగుమతులపై కనిపిస్తుండటంతో ట్రంప్ సర్కార్ ముందుకు ఈ ఫిర్యాదు వచ్చింది. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications