ఇరాన్ ను రాతియుగానికి పంపుతామంటూనే..!!
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర మీదికి వచ్చారు. తన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున సరిగ్గా 6:30 నిమిషాలకు ఆయన ప్రసంగం ఆరంభమైంది. 19 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం అంతా దాదాపు ఇరాన్ చుట్టే తిరిగింది. ఇరాన్‌పై అమెరికా సైనిక ఆపరేషన్ విజయవంతమైందని, దీన్ని త్వరలోనే ముగించబోతోన్నామని ప్రకటించారు.
ఇరాన్ సైనిక సామర్థ్యాలు, అనేక బేస్ క్యాంపులు ధ్వంసం అయ్యాయని, ఆ దేశ అణ్వస్త్ర ఆశలను చిదిమేశామని ట్రంప్ అన్నారు.ఈ యుద్ధం వల్ల తాము అనుకున్న లక్ష్యాలు నెరవేరాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' కింద అమెరికా దళాలు యుద్ధరంగంలో వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, అద్భుతమైన విజయాన్ని సాధించాయని ట్రంప్ ఉద్ఘాటించారు. ఇది మునుపెన్నడూ చూడని అరుదైన విజయంగా అభివర్ణించారు. ఇరాన్ నౌకాదళం పూర్తిగా ధ్వంసమైందని, వాయుసేన నాశనమైందని, ఖమేనీ వంటి ప్రముఖ నాయకులు మరణించారని ఆయన తెలిపారు.

ఇరాన్ పై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నియంత్రణ పూర్తిగా తొలగిస్తోన్నామని ట్రంప్ పేర్కొన్నారు. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే సామర్థ్యం గణనీయంగా తగ్గిందని, వారి ఆయుధ కర్మాగారాలు, రాకెట్ లాంచర్లను దెబ్బకొట్టామని తేల్చి చెప్పారు. అమెరికా తన సైనిక లక్ష్యాలను సాధించడానికి అతి సమీపంలో ఉందని పేర్కొన్నారు. యుద్ధానంతర ఆర్థిక పరిణామాలను సైతం ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ సైనిక ఆపరేషన్‌ను వ్యతిరేకించిన వారిని ట్రంప్ విమర్శించారు. హోర్ముజ్ జలసంధి భద్రతకు మిత్రదేశాలు ధైర్యం చేయాలని పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్య చమురు, గ్యాస్ అవసరం తమకు లేదని, అమెరికాకు సొంత ఇంధన వనరులు పుష్కలంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా ఇంధన వనరులను దక్కించుకోవాల్సిన అవసరం పాశ్చాత్య దేశాలకే అధికంగా ఉందని వ్యాఖ్యానించారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన రెండు పదవీకాలాల్లోనూ ఇరాన్‌కు అనేక రాయితీలు ఇచ్చి, ఆ దేశం చెప్పినట్లుగా నడుచుకున్నారని ట్రంప్ విమర్శించారు. తాను వచ్చాక పరిస్థితులు సమూలంగా మారాయని పేర్కొన్నారు. తన మొదటి పదవీకాలంలోనే ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సులేమానీ ఇప్పుడు సజీవంగా ఉంటే నేటి పరిస్థితులు భిన్నంగా ఉండేవని ట్రంప్ అన్నారు.
గత 47 ఏళ్ళుగా ఇరాన్ లేదా దాని మిత్రదేశాలు చేసిన దాడులను ప్రస్తావించారు ట్రంప్. అణ్వస్త్రాలను పొందేందుకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదలకుండా సుదూర క్షిపణులను వేగంగా తయారు చేస్తోందని, సంపూర్ణ అణ్వస్త్ర సామర్థ్యాలను సాధించడానికి అతి సమీపంలో ఉందని, ఇది అన్ని దేశాలకూ ప్రమాదకరమని ట్రంప్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications