సుప్రీం లీడర్ ఖమేనీ రాజీనామా చేయాలి.. గర్జించిన ఇరాన్ మాజీ యువరాజు!
Iran: ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలు.. ఫోర్డో, నటాంజ్, ఇస్సహాన్‌లపై అమెరికా దాడులకు ఇస్లామిక్ రిపబ్లిక్ అణు ఆశయాలే కారణమని బహిష్కరించబడిన యువరాజు రెజా షా పహ్లావి ఆరోపించారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాలనను అంతం చేయడానికి శాంతి మాత్రమే ఖచ్చితమైన మార్గం అని అన్నారు.
ఇరాన్ యొక్క మూడు అణు కేంద్రాలపై దాడిపై స్పందిస్తూ మాజీ యువరాజు రెజా షా పహ్లావి ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. 'ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడులు ఇస్లామిక్ రిపబ్లిక్ వినాశకరమైన అణ్వాయుధాలను అనుసరించడం వల్లేనని, ఇది ఇరాన్ ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టింది. అలీ ఖమేనీ, అతని శిథిలావస్థలో ఉన్న ఉగ్రవాద పాలన వల్లే దేశం విఫలమైంది.' అని రెజా షా పహ్లావి పేర్కొన్నారు.

'ఖమేనీ రాజీనామా చేయాలి'
అయతుల్లా అలీ ఖమేనీకి ఆయన విజ్ఞప్తి చేశారు. "మీ భూగర్భ బంకర్ నుంచి ప్రతీకారం తీర్చుకునే బదులు.. ఇరాన్ ప్రజల ప్రయోజనాల కోసం రాజీనామా చేయండి. తద్వారా అద్భుతమై ఇరాన్ దేశం ఇస్లామిక్ రిపబ్లిక్ విధ్వంసక యుగాన్ని వదిలివేసి శాంతి, శ్రేయస్సు, గొప్పదనం కోసం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదు" అని పేర్కొన్నారు. దేశంలో శాంతిని పునరిద్ధరించడానికి ఏకైక ఖచ్చితమైన మార్గం ఖమేనీ పాలన ముగింపు మాత్రమేనని ఇరాన్ మాజీ యువరాజు రెజా షా పహ్లావి తేల్చి చెప్పారు.
నిజానికి జూన్ 22న ఉదయం అమెరికా ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు స్థావరాలపై దాడి చేసింది. దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి విజయవంతమైందని, మా విమానాలన్నీ ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని అన్నారు. ఇంతలో ఇరాన్ ఈ దాడులకు ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్ అవీవ్,హైఫాతో సహా 10 ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు ప్రారంభించింది. ఈ వైమానిక దాడుల సమయంలో హెచ్చరిక సైరన్‌లు మోగడం ప్రారంభించాయి. ఇది పౌరులలో భయాందోళనలను రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్ తమ దాడులను తీవ్రతరం చేసిన తర్వాత గగనతలాన్ని మూసివేసినట్లు ఇజ్రాయెల్ విమానాశ్రయ అథారిటీ ఓ ప్రకటన జారీ చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి
ఇంతకు ముందు కూడా విమర్శించిన ఇరాన్ మాజీ యువరాజు
ఇంతకుముందు కూడా రెజా షా పహ్లవి ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీని విమర్శించారు. ఖమేనీ భయపడిన ఎలుకలా భూగర్భంలోకి వెళ్లిపోయారని, ఇప్పుడు అతనికి మార్గం లేదని అన్నారు.బహిష్కరించబడిన యువరాజు ఇరాన్ ప్రజలను ఐక్యంగా, ఈ చారిత్రాత్మక క్లిష్టమైన ఘట్టాన్ని దాటాలని విజ్ఞప్తి చేశారు. ప్రారంభించిన దానిని మార్చలేమని అన్నారు. ఇరాన్ భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉందని ఆయన తేల్చి చెప్పారు.
రెజా షా పహ్లావి ఇరాన్ లో చాలా కాలం అధికారంలో ఉన్న షా మొహమ్మద్ రెజా పహ్లావి కుమారుడు. షా మొహమ్మద్ రెజా పహ్లావి 1979 వరకు ఇరాన్‌లో అధికార పగ్గాలు నిర్వహించాడు. కానీ 37 సంవత్సరాల క్రితం జరిగిన విప్లవం ఇరాన్ మత-సామాజిక నిర్మాణాన్ని పూర్తిగా మార్చివేసింది. విప్లవం ఫలితంగా, షా మొహమ్మద్ రెజా పహ్లవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఈజిప్టుకు పారిపోవలసి వచ్చింది.












Click it and Unblock the Notifications