వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ప్రపంచానికి సాయం చేస్తోందా, లేక దేశాలను అప్పుల ఊబిలో ముంచేస్తోందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షీ జిన్‌పింగ్

ఆర్థిక సాయం అందించే అమెరికా, ప్రపంచంలోని ఇతర ప్రధాన దేశాలతో పోలిస్తే, చైనా వివిధ దేశాల్లో తమ అభివృద్ధి పనుల కోసం దాదాపు రెట్టింపు నిధులను ఖర్చు చేస్తోంది.

వీటిలో ఎక్కువ నిధులు చైనా జాతీయ బ్యాంకుల ద్వారా ఎక్కువ వడ్డీలకు అందిస్తున్నవేనని ఆధారాలు బట్టి తెలుస్తోంది. చైనా ఇస్తున్న ఈ మొత్తం షాక్ ఇచ్చేలా ఉంది.

చైనాకు విదేశాల నుంచి సాయం లభించేది అనేది అంత పాత విషయమేం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

అమెరికా, వర్జీనియాలోని విలియం అండ్ మేరీ యూనివర్సిటీలోని ఎడ్‌ డేటా రీసెర్చ్ లాబ్ వివరాల ప్రకారం 18 ఏళ్ల వ్యవధిలో చైనా 165 దేశాల్లోని 13,427 ప్రాజెక్టుల కోసం దాదాపు 843 బిలియన్ డాలర్ల నిధులు అందించింది లేదా పెట్టుబడుల రూపంలో పెట్టింది. లేదంటే రుణాలుగా ఇచ్చింది.

ఈ మొత్తంలో ఒక పెద్ద భాగం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ కింద చైనా కొత్తగా ప్రపంచ వాణిజ్య మార్గాన్ని నిర్మిస్తోంది. దానికోసం అది భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది.

చైనా ఆశయం

చైనా ప్రపంచంలోని వివిధ దేశాలకు ఇచ్చిన మొత్తం రుణాలు, పెట్టుబడులు వివరాల సేకరించడానికి ఎడ్ డేటా పరిశోధకులకు నాలుగేళ్లు పట్టింది. చైనా ఇచ్చిన మొత్తాన్ని ఏయే దేశాల్లో, ఎలా ఖర్చు చేస్తున్నారు అనే సమాచారాన్ని చైనా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు క్రమం తప్పకుండా నమోదు చేస్తుంటాయని వారు తెలిపారు.

"చైనాలో అధికారులు ఎప్పుడూ.. 'చూడండి, ఇదొక్కటే ప్రత్యామ్నాయం' అని చెప్పడం మేం వింటుంటాం అని ఎడ్ డేటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాడ్ పార్క్స్ చెప్పారు.

చైనా, దాని పొరుగు దేశం లావోస్ మధ్య నడిచే రైలు మార్గాన్ని చైనా 'ఆఫ్ ద బుక్' రుణానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా భావిస్తున్నారు.

నైరుతి చైనాను నేరుగా ఆగ్నేయ ఆసియాకు కలపడం ఎలా అని ఆ దేశ రాజకీయ నాయకులు దశాబ్దాలపాటు ఆలోచించారు.

అయితే, దానికి చాలా వ్యయం అవుతుందని ఇంజనీర్లు మొదటి నుంచీ హెచ్చరిస్తూనే వచ్చారు. లోయల్లో, పర్వతాల్లో పట్టాలు వేయాలంటే వందలాది వంతెనలు, సొరంగాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పారు.

ఆ ప్రాంతంలోని నిరుపేద దేశాల్లో లావోస్‌ ఒకటి. ఈ ప్రాజెక్ట్ వ్యయంలో అది ఒక వాటా కూడా భరించలేకపోయింది. అయినప్పటికీ అక్కడి బ్యాంకర్లు, చైనా రుణదాతలతో ఉన్న ఒక సంఘం సాయంతో 5.9 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ రైల్వే మార్గాన్ని డిసెంబర్‌లో ప్రారంభించారు.

అయితే, తక్కువే అయినప్పటికీ లావోస్ తన వాటాను చెల్లించాల్సి వచ్చింది. కానీ అది తన వాటా చెల్లించడానికి దేశంలోనే ఉన్న ఒక చైనా బ్యాంక్ నుంచి 480 మిలియన్ డాలర్లు రుణం తీసుకోవాల్సి వచ్చింది.

లావోస్‌కు ఆదాయం తెచ్చిపెట్టే వనరులు(పొటాష్ గనులు లాంటివి) చాలా పరిమితంగా ఉన్నాయి. కానీ వాటి ద్వారా వచ్చే లాభాల్లో కూడా ఒక పెద్ద భాగం చైనా అప్పు తీర్చడానికే ఖర్చు చేస్తున్నారు.

"వాటాదారుగా లావోస్‌కు చైనా బ్యాంక్ రుణం ఇవ్వడం అనేది నిజానికి ఈ ప్రాజెక్టు ద్వారా ముందుకు సాగాలనే చైనా బలమైన కోరికను ప్రతిబింబిస్తుంది" అని హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వాంజింగ్ కెలీ చేన్ అన్నారు.

షీ జిన్ పింగ్

రుణ దౌత్యం

ఈ రైల్వే లైన్‌లో ఎక్కువ భాగం చైనా ఆధిపత్యంలోని రైల్వే గ్రూప్ యాజమాన్యంలో ఉంది. కానీ ఈ ఒప్పందంలో సందేహాస్పదంగా ఉన్న నిబంధనల ప్రకారం ఈ రుణం తీర్చాల్సిన బాధ్యత చివరకు లావోస్ ప్రభుత్వానికే ఉంటుంది.

సమతుల్యం లేని ఈ ఒప్పందం ఫలితంగా అంతర్జాతీయ రుణదాతలు లావోస్ క్రెడిట్ రేటింగ్‌ను జంక్(డౌన్ గ్రేడ్)‌కు తగ్గించాలని ఆలోచిస్తున్నారు.

2020 సెప్టెంబర్‌లో లావోస్ దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకుంది. అలాంటి సమయంలో దానిని తప్పించుకోడానికి అది చైనాకు తమ ఒక పెద్ద ఆస్తిని విక్రయించింది. చైనా రుణదాతల నుంచి తీసుకున్న రుణం నుంచి ఉపశమనం పొందడానికి లావోస్ తన పవర్ గ్రిడ్‌లోని ఒక వాటాను 600 మిలియన్ డాలర్లకు చైనాకు అప్పగించింది.

ఈ లావాదేవీలన్నీ రైల్వే కార్యకలాపాలు ప్రారంభించక ముందే జరిగిపోయాయి.

చాలా పేద, మధ్య ఆదాయ దేశాలకు చైనా ఒక ఫైనాన్షియర్ పాత్ర పోషిస్తోందని ఎడ్ డేటా చెబుతోంది.

"చైనా వివిధ దేశాల్లో చేపట్టిన తన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఏడాదికి సగటున దాదాపు 85 బిలియన్ డాలర్లు పెడుతుంటే, అమెరికా వివిధ దేశాల్లో కొనసాగుతున్నతన అభివృద్ధి కార్యకలాపాల కోసం సగటున ఏడాదికి దాదాపు 37 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తోంది" అని అని బ్రాడ్ పార్క్స్ చెప్పారు.

చైనా అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల్లో ఆర్థిక సాయం అందించే విషయంలో ప్రపంచంలోని మిగతా దేశాలను దాటి చాలా ముందుకెళ్లిపోయిందని ఎడ్ డేటా చెబుతోంది.

అఫ్రికా దేశాలను అప్పుల్లోకి ముంచేస్తున్నాయని గతంలో పశ్చిమ దేశాలు ఆరోపణలు ఎదుర్కునేవి, కానీ ఇప్పుడు చైనా మరో రకం రుణాలు ఇస్తోంది. ఒక ప్రాజెక్ట్ కోసం నిధులు లేదా అప్పుగా ఇవ్వడానికి బదులు అది ఆ మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తోంది.

ఇలాంటి రుణాల వివరాలు ప్రభుత్వ రుణాల అధికారిక ఖాతాల్లో కనిపించవు. ఎందుకంటే జాతీయ బ్యాంకుల చాలా ఒప్పందాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు ఉండవు. ఇలాటి ఒప్పందాలను ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్ నుంచి దూరంగా ఉంచుతారు. దాంతోపాటూ ఈ ఒప్పందాల్లో చాలా రహస్య నిబంధనలు కూడా ఉంటాయి.

ఈ రుణ మొత్తం దాదాపు 385 బిలియన్ డాలర్ల వరకూ ఉండచ్చని ఎడ్ డేటా ఒక అంచనా వేసింది.

రుణాలు ఇస్తున్న సమయంలో తాము సాయం చేస్తున్న దేశాలకు అసాధారణ డిమాండ్లు పెడతారు. చేస్తారు. చాలాసార్లు, తమ సహజ వనరులను అమ్మి వచ్చిన మొత్తంతో రుణం చెల్లిస్తామని ఆయా దేశాలు రుణదాతలకు మాట ఇవ్వాల్సి వస్తుంది.

వెనెజ్వెలాతో జరిగిన ఒప్పందం దీనికి ఒక ఉదాహరణ. ఈ డీల్‌లో ఆ దేశం చమురు విక్రయాలతో వచ్చిన విదేశీ కరెన్సీని నేరుగా చైనా నియంత్రిత బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుందని, ఒకవేళ ఎలాంటి చెల్లింపులు జరగకపోతే, చైనా రుణదాతలు ఆ ఖాతా నుంచి నగదు తీసుకోవచ్చని నిబంధనలు పెట్టారు.

వండర్స్ ఎనా గెల్పర్న్ ఒక లా ప్రొఫెసర్. ఆయన చైనా అభివృద్ధి పనులకు సంబంధించిన రుణ ఒప్పందాలను పరిశీలించే ఎడ్ డేటా అధ్యయనంలో ఈ ఏడాది ప్రారంభంలో చేరారు.

"చైనా స్మార్ట్ అవుతోందా? అది తన ప్రయోజనాలను పూర్తిగా కాపాడుకుంటోంది.. అని మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ఒక వేళ వారు(రుణం తీసుకున్న దేశాలు) తమ రుణాలు చెల్లించడంలో విఫలమైతే అవి తమ భౌగోళిక ఆస్తులను అంటే ఏవైనా రేవులు లాంటివి చైనాకు అప్పగిస్తాయి" అంటారు గెల్పర్న్..

చైనా రాబోవు కాలంలో కొంత పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది. జూన్‌లో జీ-7 దేశాల సమావేశం జరగబోతోంది. చైనా ప్రభావం తగ్గించడానికి జీ-7 వ్యయ ప్రణాళిక అమలు చేయాలని చూస్తున్నట్లు అమెరికా, దాని మిత్ర దేశాలు చెప్పాయి. ఈ ప్రణాళిక ద్వారా అది ప్రపంచ వ్యాప్తంగా నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిస్తుంది.

అయితే, ఈ ప్రణాళిక అమల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

"పశ్చిమ దేశాల ఈ ప్రయత్నం చైనాను అంత ప్రభావితం చేస్తుందా అనేది సందేహమే" అని బుకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ సీనియర్ ఫెలో, చైనాలో మాజీ అమెరికన్ ట్రెజరీ ప్రతినిధి డేవిడ్ డాలర్ అన్నారు.

బెల్డ్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు స్వయంగా కొన్ని అంశాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు.

చైనాకు సంబంధించిన మిగతా అభివృద్ధి ఒప్పందాలతో పోలిస్తే ఈ ప్రాజెక్టులో అవినీతి, కార్మిక కుంభకోణాలు, పర్యావరణ సవాళ్లు లాంటివి కనిపిస్తున్నాయి.

"బీఆర్ఐ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు వెళ్లాలంటే, ఈ ఆందోళనలను దూరం చేయడం తప్ప బీజింగ్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు అంటున్నారు" ఎడ్ డేటా పరిశోధకులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is China is helping the world, or drowning countries in a debt trap
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X