ఐఎస్ఐఎస్ మారణహోమం: 60 మంది బలి
బీరూట్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు రద్దీగా ఉన్న ప్రాంతాలలో ట్రక్కులలో శక్తి వంతమైన బాంబులు పెట్టి పేల్చివేశారు. ఈ దాడుల్లో 60 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు తెలిపారు.
80 మందికి పైగా తీవ్రగాయాలై వివిద ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని కుర్ధిష్ మిలటరి అధికారులు తెలిపారు. దాడులు చేసింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు.
సిరియా ఈశాన్య ప్రాంతంలోని హస్కా ప్రావిన్స్ లో హస్కా ప్రభుత్వ ఆసుపత్రి, దినసరి మార్కెట్ దగ్గర నిత్యం రద్దీగా ఉంటుంది. శుక్రవారం ఆసుపత్రి, మార్కెట్ దగ్గరకు ఉగ్రవాదులు బాంబులు అమర్చిన రెండు ట్రక్కులు తీసుకు వెళ్లారు.

ఎక్కువ మంది ప్రజలు ఉన్న సమయంలో ఒకే సారి రెండు ట్రక్కులు పేల్చివేశారు. అంతకు ముందు శుక్రవారం వేకువ జామున టెల్ టమర్ పట్టణంలోని నివాస ప్రాంతాల దగ్గర ఓ ట్రక్కులో బాంబులు పెట్టి పేల్చి వేశారు.
ఈ మూడు బాంబు పేలుళ్లలో 60 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. అవయవాలు తెగి చెల్లాచెదురుగా పడ్డాయి. తీవ్రగాయాలైన వారు ఆసుపత్రులలో మృత్యువుతో పోరాడుతున్నారని మిలటరి అధికారులు చెప్పారు.
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పై అమెరికా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా సంకీర్ణ దళాలు స్థానిక కుర్ధిష్ మిలటరి సహకారంతో ఐఎస్ఐఎస్ మీద దాడులు చేస్తున్నది. ప్రతికారం కోసం ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని ఉన్నతాధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications