విమాన సర్వీసులన్నీ రద్దు- యుద్ధ మేఘాలు
Israel attack on Iran: ఇరాన్‌పై భారీ దాడికి దిగింది ఇజ్రాయెల్. బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇటీవలే తమ దేశంపై నిర్వహించిన దాడులకు ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా కీలక ప్రాంతాలపై విరుచుకుపడింది. ప్రత్యేకించి- ఇరాన్ సైన్యం ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఆర్మీ, ఎయిర్ బేస్ క్యాంప్‌లపై ఈ దాడులు జరిగాయి.
భారత కాలమానం ప్రకారం- అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో ఇజ్రాయెల్ ఈ వైమానిక దాడులకు దిగింది. దీనికోసం డ్రోన్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను వినియోగించింది. టెహ్రాన్, నగర శివార్లు, పరిసర పట్టణాల్లో పలు చోట్ల సైరెన్ మోతలు డ్రోన్లు, యూఏవీలు దూసుకెళ్లిన శబ్దాలు వినిపించాయి.

టెహ్రాన్, ఖుజెస్తాన్, ఐలమ్ ప్రావిన్స్ వంటి ప్రాంతాలపై కొన్ని గంటల పాటు ఏకధాటిగా ఈ దాడులు సాగినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. ఇరాన్ మిస్సైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సహా ఇతర ఇరానియన్ మిలటరీ బేస్‌లపై ఈ దాడులు జరిగినట్లు తెలిపింది.
ఈ దాడులను ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారిక వార్తా సంస్థ తన్సీమ్ న్యూస్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. టెహ్రాన్ సమీపంలో భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపింది. ఇజ్రాయెల్ అకారణంగా దాడలకు పాల్పడుతోందని, కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. ఆ దేశం యుద్ధాన్ని కోరుకుంటోందంటూ మండిపడింది.
ఈ దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగెరి ధృవీకరించారు. తమదేశంపై సాగించినందువల్ల ఇరాన్‌కు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. మున్ముందు మరిన్ని దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు.
ఈ పరిణామాల మధ్య ఇరాన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి సమాయాత్తమౌతోంది. ఇందులో భాగంగా తమ దేశ గగనతలాన్ని మూసివేసింది. అన్ని విమాన సర్వీసులనూ రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ విమాన సర్వీసులను పునరుద్ధరించకూడదని సూచించింది.
ఈ మేరకు ఇరాన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జాఫర్ యజెర్లెవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఎప్పుడు పునరుద్ధరించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications