భారత్‌తో మా బంధం విడదీయరానిది..మోడీతో కలిసి పనిచేస్తాం: ఇజ్రాయిల్ కొత్త ప్రధాని బెన్నెట్
భారత ప్రధానితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇజ్రాయిల్ కొత్త ప్రధాని నఫ్తాలీ బెన్నెట్. భారత్ ఇజ్రాయిల్ దేశాల మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ కొత్త ప్రధాని బెన్నెట్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌కు పై విధంగా స్పందించారు బెన్నెట్.
రైట్ వింగ్ యామినా పార్టీకి చెందిన 49 ఏళ్ల బెన్నెట్ ఆదివారం రోజున ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. దీంతో 12 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూ గద్దె దిగాల్సి వచ్చింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభినందన ట్వీట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. త్వరలోనే బెన్నెట్‌తో సమావేశమై భారత్ ఇజ్రాయిల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంను మరింత బలోపేతం చేసేలా కృషిచేయాల్సి ఉందన్నారు. వచ్చే ఏడాదితో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లు పూర్తవుతాయి. ప్రధాని మోడీ ట్వీట్‌కు బెన్నెట్ సమాధానం ఇస్తూ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య మంచి సంబంధాలు కచ్చితంగా కొనసాగుతాయని చెబుతూ తనకు అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు బెన్నెట్.

ఇజ్రాయిల్ 13వ ప్రధానిగా బెన్నెట్‌ను పార్లమెంటు ఎన్నుకోగా ఆదివారం రోజున బెన్నెట్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇజ్రాయిల్‌లో ఏర్పాటు అయిన కొత్త ప్రభుత్వం భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి యార్ లాపిడ్ చెప్పారు. భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆదేశ విదేశాంగ మంత్రి ఈమేరకు స్పందించారు. ఇక యేష్ అతిద్ పార్టీ అధినేతగా ఉన్న విదేశాంగ మంత్రి లాపిడ్ 2023లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఈమేరకు ఒప్పందం జరిగింది. ఇక విజయవంతంగా తన పదవీ కాలం పూర్తి చేసినందుకు గాను బెంజమిన్ నెతన్యాహూపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని మోడీ. భారత్-ఇజ్రాయిల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావడంలో కీలక పాత్ర నెతన్యాహూ పోషించారని ప్రధాని మోడీ కొనియాడారు.
Thank you Mr. Prime Minister @narendramodi, I look forward to working with you to further develop the unique and warm relations between our two democracies. 🇮🇱🇮🇳 https://t.co/TbwhJuPz9u
— PM of Israel (@IsraeliPM) June 14, 2021
ఇజ్రాయిల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ ఉన్న సమయంలో 2017లో భారత ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లినప్పుడు ఘనస్వాగతం పలకడమే కాకుండా ఇద్దరూ ఎంతో సరదాగా గడిపారు. ఆ నాటి పర్యటనపై నేటికీ ఇజ్రాయిల్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. అదొక చారిత్రాత్మకమైన పర్యటనగా అభివర్ణించారు. ఒక దేశ ప్రధానికి ఈ స్థాయిలో ఇజ్రాయిల్ ప్రధాని ఘనస్వాగతం పలకడం పర్యటన ఆసాంతం మోడీతోనే ఉండటం అనేది అతి కొద్ది మందికి దక్కిన గౌరవం అని ఆదేశ మీడియా చెప్పుకొస్తోంది.












Click it and Unblock the Notifications