బాగ్దాది కోసం అమెరికా సైన్యం ఉచ్చు: కోడ్ వర్డ్స్..సహకరించిన సిరియా కుర్దులు!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను వణికించిన భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ కథను ఎట్లకేలకు ముగించింది అమెరికా సైన్యం. సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ ను కేంద్రబిందువుగా చేసుకుని తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించిన ఇస్లామిక్ స్టేట్స్ కోరలు పీకింది. ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాది ఆతహత్య చేసుకోవడం, అతని ముగ్గురు కుమారులు కూడా ఈ ఆపరేషన్ లో హతం కావడం వల్ల ఇప్పట్లో ఐసిస్ తేరుకోలేకపోవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాగ్దాది మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాతే.. అతను మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు.
నరరూప రాక్షసుడిని మట్టుబెట్టిన అమెరికా బలగాలు: సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్: నాడు లాడెన్..

అమెరికా సైన్యం వలలో బాగ్దాది ముఖ్య అనుచరుడు
బాగ్దాదిని అంతమొందించడానికి అమెరికా సైన్యం సుమారు రెండేళ్ల నుంచీ వల పన్నుతూ వచ్చింది అమెరికా సైన్యం. దీనికోసం అనేక వ్యూహాలను అనుసరించినట్లు విదేశీ మీడియా చెబుతోంది. సాధారణ పౌరుల తరహాలో అమెరిక గూఢచర్య సంస్థ సీఐఏ ఏజెంట్లు సిరియాలో మకాం వేశారట. ఏడాదిన్నర కిందట రంగంలోకి దిగిన సీఐఏ ఏజెంట్లు.. అక్కడి ప్రజలతో కలిసి పోయారు. ఇస్లామిక్ స్టేట్స్ ఆనుపానులను తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ లను సైతం రూపొందించగలిగారు. వాటిని చాకచక్యంగా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖకు అందజేయగలిగారు. బాగ్దాది ముఖ్య అనుచరుడిని వలలో వేసుకోవడం ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్లు తెలుస్తోంది.

జాక్ పాట్ గా బాగ్దాది..
ఈ ఆపరేషన్ మొత్తంలో కొన్ని కీలకమైన కోడ్ వర్డ్స్ లను అమెరికా సైన్యం వినియోగించినట్లు విదేశీ మీడియా వెల్లడించింది. ప్రత్యేకించి- అబు బాకర్ అల్ బాగ్దాది కోసం జాక్ పాట్ అనే కోడ్ నేమ్ ను ఉపయోగించింది. ఈ ఆపరేషన్ మొత్తానికీ జాక్ పాట్ అనే పదం ఎక్కడ వినిపించినా.. అది బాగ్దాదీని ఉద్దేశించిందే. దీనితో పాటు బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్న తరువాత.. జాక్ పాట్ ఈజ్ డెడ్ అంటూ సమాచారాన్ని పంపించినట్లు విదేశీ మీడియా పేర్కొంది. అనంతరం అతని ముగ్గురు కుమారుల మరణానికి సంబంధించి కూడా కొన్ని కోడ్ పదాలను వాడినట్లు తేలింది.

సిరియా కుర్దుల కీలక పాత్ర..
బాగ్దాదిని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం సాగించిన ఈ సుదీర్ఘ ఆపరేషన్ లో సిరియాకు చెందిన కుర్దుల పాత్ర కీలకంగా మారినట్లు చెబుతున్నారు. కుర్దులు సారథ్యాన్ని వహిస్తోన్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సహకారించినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఎస్డీఎఫ్ లో 60 వే మంది వరకు అరబ్బులు, కుర్దులు, క్రైస్తవులు ఉన్నారు. దీనికి సిరియాకు చెందిన కుర్దులు నాయకత్వాన్ని వహించారు. కారణం.. స్థానికులు కావడం వల్ల ఇస్లామిక్ స్టేట్స్ ఆనుపానులు, కదలికల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండటమే.

ఐసిస్ కథ ముగిసినట్టేనా..
ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్ పేరుతో దీన్ని స్థాపించిన అబు బాకర్ అల్ బాగ్దాది ఆత్మహత్య చేసుకోవడంతో ఇక దాని కథ దాదాపు ముగిసిపోయినట్టేనని భావిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో బాగ్దాది ముగ్గురు కుమారులు హతం కావడం వల్ల ఇక నాయకత్వ లోటు ఏర్పడటం ఖాయమని, దీన్ని భర్తీ చేసుకోవడానికి చాలా సమయం పడుతుందనే అభిప్రాయాలు అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమౌతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, టర్కీ బలగాలు ఐసిస్ ను నామరూపాల్లేకుండా చేయడానికి ఈ వ్యవధి సరిపోతుందని అంటున్నారు. ఒసామా బిన్ లాడెన్ హత్యానంతరం అల్-ఖైదా ఎలాంటి నాయకత్వ లోటును ఎదుర్కొన్నదో అదే పరిస్థితి ఐసిస్ కు ఎదురవుతుందని చెబుతున్నారు.