విరుచుకుపడ్డ సునామీ: ఉత్పాతాన్ని మోసుకొచ్చిన కొత్త ఏడాది
Japan earthquake: జపాన్‌లో మరోసారి పెను భూకంపం సంభవించింది. పశ్చిమ తీర ప్రాంతాన్ని వణికించింది. భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
తీర ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్షర్ రీజియన్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా రికార్డయింది. జపాన్ పశ్చిమ ప్రాంతంలో ఉంటుందీ ఇషికవా ప్రీఫెక్షర్. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:10 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇషికావ ప్రీఫెక్షర్ పరిధిలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత.. తీర ప్రాంతంలోని ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్‌లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ మూడు రీజియన్ల పరిధిలో ఉన్న నగరాలను భయభ్రాంతులకు గురి చేసింది.
తీర నగరాలైన వజీమా, నొటో, కషివజక్కిల్లో భూ ప్ర్రకంపనలు నమోదయ్యాయి. 4:10 నిమిషాల నుంచి 5:20 మధ్యకాలంలో ఏకంగా 20 సార్లు భూమి ప్రకోపించింది. ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ఆస్తి నష్టం మాత్రం భారీగా చోటు చేసుకుంది.

తీర ప్రాంత నగరాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. వాటి శిథిలాల మధ్య పలువురు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది. సునామీ అలల ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. అనమిఝు, ననావో, న్యూజెన్, కురొబె-షి తీరాల్లో అయిదు మీటర్ల వరకు అలలు ఎగిసిపడినట్లు జపాన్ న్యూస్ అవుట్‌లెట్ ఎన్‌హెచ్‌కే తెలిపింది. సునామీ సంభవించినట్లు అధికారికంగా ప్రకటించినట్లు పేర్కొంది.
భూకంపం, సునామీ ప్రభావిత ప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ కూడా అందుబాటులో ఉండట్లేదు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సైతం బంద్ అయింది. కుప్ప కూలిన భవనాల మధ్య పలువురు చిక్కుకుని ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ అత్యవసర సమావేశాన్ని పిలుపునిచ్చారు. తీర ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఇషికావ, నిగిట, టొయొమా, యమగట ప్రీఫెక్షర్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications