చందమామపై క్రాష్ ల్యాండ్: ఇస్రో తరువాత మళ్లీ..!!
టోక్యో: నాలుగేళ్ల కిందట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై ల్యాండర్‌ను సరిగ్గా ల్యాండ్ చేయడంలో ఇస్రో సక్సెస్ కాలేకపోయింది. చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయింది. చందమామ ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. ఆ తరువాత దాని శకలాలను ఇస్రో గుర్తించింది.
ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. జాబిల్లిపై ప్రయోగాలను చేయడానికి జపాన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఆ సంస్థ పంపించిన స్పేస్ క్రాఫ్ట్.. చందమామపై క్రాష్ ల్యాండ్ అయింది. చంద్రుడి ఉపరితలాన్ని సమీపించిన వెంటనే దానితో సంబంధాలు కోల్పోయినట్లు వెల్లడించింది. దీన్ని పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని పేర్కొంది.

ఐస్పేస్ అనే ఓ ప్రైవేట్ స్టార్టప్.. ఈ మూన్ మిషన్‌ను చేపట్టింది. డిసెంబర్ 11వ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి స్పేస్‌ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్-9 రాకెట్ సహాయంతో ఈ ల్యాండర్‌ను చంద్రుడిపై పంపించింది. దీనిపేరు హకుటో- ఆర్ 1. చంద్రుడిపై ఈ ల్యాండర్‌ను నడిపించడానికి అవసరమైన రోవర్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అభివృద్ధి చేసింది. ప్రయోగించిన నెల రోజుల తరువాత చంద్రుడి కక్ష్యలోకి అడుగు పెట్టింది ఈ ల్యాండర్.
మంగళవారం రాత్రి చంద్రుడి ఉపరితలంపై దీన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించింది. అట్లాస్ క్రెటర్‌పై దీన్ని దించాలని భావించింది. జపాన్ కాలమానం ప్రకారం.. రాత్రి 1:40 నిమిషాలకు ఇది చంద్రుడి మీద ల్యాండ్ కావాల్సి ఉంది. ఉపరితలానికి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో హకుటో-ఆర్1 ల్యాండర్ జాడ గల్లంతయింది. బ్లాక్ అవుట్ ఏర్పడింది. సంబంధాలు తెగిపోయాయి.
ఆ సమయంలో హకుటో ల్యాండర్ వేగం.. గంటకు 6,000 కిలోమీటర్లు. సజావుగా ల్యాండ్ చేయాలంటే దీన్ని సున్నా వేగానికి తగ్గించాల్సి ఉంటుంది. ఈ వేగాన్ని తగ్గించడంలో ఐస్పేస్ సైంటిస్టులు విఫలం అయ్యారు. దీనితో అదే వేగంతో దూసుకెళ్లిన హకుటో ల్యాండర్.. చంద్రుడి ఉపరితలం మీద క్రాష్ ల్యాండ్ అయింది. జపాన్‌కు చెందిన టాయ్ మేకర్ కంపెనీ జక్సా, సోనీ గ్రూప్.. ఈ ల్యాండర్‌ను డిజైన్ చేశాయి.
We’ve received another incredible photo from the camera onboard our Mission 1 lander!
— ispace (@ispace_inc) April 24, 2023
Seen here is the lunar Earthrise during solar eclipse, captured by the lander-mounted camera at an altitude of about 100 km from the lunar surface. (1/2) pic.twitter.com/pNSI4lPnux
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన మహ్మద్ బిన్ రషీద్ అభివృద్ధి చేసిన రోవర్‌ను దీనికోసం ఉపయోగించింది. ఈ రోవర్ పేరు రషీద్. తమ మిషన్ విఫలమైనట్లు ఐస్పేస్ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు- మూడు దేశాలు మాత్రమే చంద్రునిపై తమ ల్యాండర్‌ను విజయవంతంగా దించగలిగారు. అమెరికా, ఒకప్పటి సోవియట్ యూనియన్, చైనా.. ఈ మూడు దేశాలు చంద్రుడిపై తమ ప్రయోగాలను విజయవంతంగా మలచుకున్నాయి. చంద్రుడిపై మనుషులను పంపించింది అమెరికా ఒక్కటే.












Click it and Unblock the Notifications