మోదీ వజ్రాన్ని అమెరికా ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
అగ్రరాజ్యం అమెరికా ప్రథమ మహిళ అయినా.. మనసు పడిన వజ్రాన్ని సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. దౌత్యపరమైన బహుమతుల విషయంలో అమెరికా చట్టాలు ఎంత కఠినంగా, పారదర్శకంగా ఉంటాయో వివరిస్తూ అమెరికా మాజీ ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ రాసిన తాజా స్మృతిగ్రంథం 'వ్యూ ఫ్రమ్ ది ఈస్ట్ వింగ్: ఏ మెమోయిర్' (View from the East Wing: A Memoir) ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. అందులోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు బహూకరించిన అరుదైన వజ్రం గురించి ఆమె రాసిన విషయాలు భారతీయులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
జూన్ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో చేసిన చారిత్రాత్మక పర్యటన భారత్-అమెరికా దౌత్య బంధంలోనే ఒక మైలురాయి. రక్షణ, సెమీకండక్టర్ల రంగాల్లో వ్యూహాత్మక ఒప్పందాలతో పాటు వైట్‌హౌస్‌లో దాదాపు 10 వేల మంది భారతీయ అమెరికన్ల సమక్షంలో జరిగిన ఆ వేడుకలో మోదీ ఒక ప్రత్యేక కానుకను తెచ్చారు. అదే.. 7.5 క్యారెట్ల గ్రీన్ 'ల్యాబ్-గ్రోన్'వజ్రం. పర్యావరణహితంగా, అత్యాధునిక సాంకేతికతతో వజ్రాల ఉత్పత్తిలో భారత్ సాధించిన ప్రగతికి ప్రతీకగా మోదీ దీనిని జిల్ బైడెన్‌కు బహూకరించారు. "ఆ వజ్రం అత్యంత అద్భుతంగా, కాంతులీనుతూ ఉంది" అని జిల్ బైడెన్ తన పుస్తకంలో ఆ డైమండ్‌ను కొనియాడారు.

రూ.2 లక్షల బిల్లు.. కానీ అసలు విలువ రూ.16 లక్షలు!
ఆ వజ్రం అపురూప సౌందర్యాన్ని చూసి జిల్ బైడెన్ దాన్ని తన వద్దే ఉంచుకోవాలని ఆశపడ్డారు. ప్రధాని స్వగ్రామ పరిసరాల్లో దీనిని సుమారు 2,500 డాలర్ల (దాదాపు ₹2 లక్షలు) వ్యయంతో తయారు చేశారని, అందుకు సంబంధించిన బిల్లు కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. అమెరికా నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరను చెల్లిస్తే ఆ బహుమతిని సొంతం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో జిల్ బైడెన్ దాన్ని డబ్బులు కట్టి కొనేద్దామని అనుకున్నారు. కానీ, అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆ వజ్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం దాని విలువ ఏకంగా 20,000 డాలర్లు (సుమారు రూ.16 లక్షల పైమాటే) గా తేల్చింది. అంత భారీ మొత్తం చెల్లించలేక ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
సొంతం కాలేదు.. కానీ 'ఉంగరం'గా మెరిసింది!
"టెక్నికల్ గా ఆ వజ్రం నాకు ఇవ్వలేదు. అది ప్రథమ మహిళకు అందిన ప్రభుత్వ బహుమతి. కాబట్టి అది ఫెడరల్ ప్రభుత్వానికే చెందుతుంది" అని జిల్ బైడెన్ స్పష్టం చేశారు. అయితే, దాన్ని కొనుగోలు చేయకపోయినా.. కేవలం అధికారిక కార్యక్రమాల్లో ధరించేందుకు ఆమె ప్రత్యేక అనుమతి పొందారు. ఆ వజ్రాన్ని ఒక అందమైన ఉంగరానికి (రింగ్) అమర్చుకుని వైట్‌హౌస్‌లో ఉన్నంత కాలం అధికారిక వేడుకల్లో ధరించారు. వైట్‌హౌస్ పదవీ కాలం ముగిసిన తర్వాత నిబంధనల ప్రకారం ఆ అపురూప వజ్రాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించగా.. ప్రస్తుతం అది అమెరికా అధ్యక్షుల బహుమతులను భద్రపరిచే అధికారిక వేర్‌హౌస్‌కు చేరింది.
నిబంధనలు కఠినం.. కానీ ఆ కంకణం మాత్రం సొంతం!
ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్నవారు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు పొందకూడదనే వైట్‌హౌస్ నియమాలకు ఉక్రెయిన్ ఇచ్చిన ఒక బ్రోచ్ (విలువ 14,063 డాలర్లు) ఉదంతాన్ని కూడా ఆమె గుర్తుచేశారు. అయితే, ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ తనకు ఇచ్చిన ఒక కంకణం (బ్రేస్‌లెట్) విషయంలో మాత్రం జిల్ బైడెన్ భిన్నంగా వ్యవహరించారు. ఆ కంకణంతో ఉన్న ప్రత్యేక భావోద్వేగ అనుబంధం కారణంగా, తాము పదవి నుంచి తప్పుకునే సమయంలో ప్రభుత్వానికి స్వయంగా తగిన ధర చెల్లించి దాన్ని తన సొంతం చేసుకున్నానని, ఇప్పటికీ దాన్ని ప్రతిరోజూ ధరిస్తానని జిల్ బైడెన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఏదేమైనా మోదీ ఇచ్చిన భారతీయ ల్యాబ్-గ్రోన్ వజ్రం అమెరికా వైట్‌హౌస్ నిబంధనల పారదర్శకతకు ఒక మచ్చుతునకగా నిలిచిపోయింది.














Click it and Unblock the Notifications