• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జో బైడెన్: అమెరికా కొత్త అధ్యక్షుడి కోసం వైట్ హౌజ్ ఎలా సిద్ధమవుతోంది?

By BBC News తెలుగు
|

డోనల్డ్ ట్రంప్, జో బైడెన్

అమెరికాలో డోనల్డ్ ట్రంప్ పాలనకు బుధవారంతో తెరపడుతోంది. జో బైడెన్ అధ్యక్ష హోదాలో వైట్ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారు.

ఇందుకోసం వైట్ హౌజ్‌లో ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ట్రంప్ బృందం స్థానంలో బైడన్ బృందం బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

ట్రంప్‌కు సీనియర్ విధాన సలహాదారుగా ఉన్న స్టీఫెన్ మిల్లర్ గత వారం వైట్ హౌజ్‌లోని వెస్ట్ వింగ్‌లో తచ్చాడుతూ కనిపించారు.

ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ప్రసంగాలు, విధానాల రూపకల్పనలో మిల్లర్ కీలకపాత్ర పోషించారు. ట్రంప్ పాలన మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఆయన బృందంలో కొనసాగిన అతికొద్ది మంది వ్యక్తుల్లో మిల్లర్ కూడా ఒకరు.

మిల్లర్ గోడకు ఒరిగి, సహచరులతో తాపీగా మాట్లాడుతూ కనిపించారు.

సాధారణంగా వెస్ట్ వింగ్ ఎప్పుడూ జనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంది. టెలి ఫోన్లు మోగడం లేదు. సిబ్బంది మధ్యలో వదిలేసి వెళ్లిపోయినట్లుగా... డెస్క్‌లపై దస్త్రాలు, లేఖలు పేరుకుపోయినట్లు ఉన్నాయి.

జనవరి 6న క్యాపిటల్ భవనంలో అల్లర్లు జరిగినప్పుడే పదుల సంఖ్యలో సీనియర్ అధికారులు, సిబ్బంది విధుల నుంచి వెళ్లిపోయారు. మిల్లర్ లాంటి కొంత మంది ట్రంప్ విధేయులు మాత్రమే ఇప్పుడు అక్కడ మిగిలారు.

సహచరులతో మిల్లర్ సంభాషణను ముగించుకోగానే... 'తదుపరి ఎక్కడికి వెళ్తున్నారు?’ అని ఆయన్ను ప్రశ్నించాను. 'నా కార్యాలయానికే తిరిగి వెళ్తున్నా’ అని ఆయన సమాధానం ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బుధవారం మిల్లర్ కార్యాలయాన్ని పూర్తిగా ఖాళీ చేసి, బైడెన్ బృందం కోసం దాన్ని సిద్ధం చేస్తారు.

అధ్యక్షులు మారినప్పుడు వెస్ట్ వింగ్‌లో కార్యాలయాలను ఖాళీ చేసే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే, ఎప్పుడూ సహృద్భావ వాతావరణంలోనే ఈ ప్రక్రియ జరగాలనేమీ లేదు.

అభిశంసనకు గురైన అధ్యక్షుడు ఆండ్ర్యూ జాన్సన్ 1869లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఉలిసెస్ ఎస్ గ్రాంట్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వలేదు. జాన్సన్‌ను గద్దె దింపాలని కృషి చేసిన గ్రాంట్... ఈ పరిణామానికి ఆశ్చర్యపోలేదు.

వైట్ హౌజ్

ఈసారి ప్రక్రియ మరింత భిన్నం. సాధారణంగా ఎన్నికలు పూర్తవ్వగానే ఈ ప్రక్రియ మొదలవుతుంది. కానీ, ట్రంప్ ఓటమిని అంగీకరించకపోవడంతో కొన్ని వారాలు ఆలస్యంగా మొదలవ్వాల్సి వచ్చింది.

పైగా బైడెన్ ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానని ట్రంప్ ప్రకటించారు.

''అధికార మార్పు ప్రక్రియ ఒడిదొడుకులతో సాగుతుండొచ్చు. కానీ, అది పూర్తవ్వడం తథ్యం’’ అని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో అమెరికా చరిత్రను బోధిస్తున్న ప్రొఫెసర్ శాన్ విలెంట్జ్ అన్నారు.

అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే అధికార మార్పిడి ఓ గందరగోళ వ్యవహారం. భారీ స్థాయిలో సమాచార మార్పిడి, అధికారుల మార్పిడి కూడా జరగాల్సి ఉంటుంది.

ట్రంప్ ప్రభుత్వంలో మిల్లర్ లాంటి రాజకీయ పదవుల్లో ఉన్నవారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నారు. వీళ్లందరి స్థానంలో ఇప్పుడు బైడెన్ నియమించిన వ్యక్తులు వచ్చి చేరుతారు.

సగటున 1.5 లక్షల నుంచి 3 లక్షల మంది వరకూ ఈ పదవుల కోసం దరఖాస్తు చేస్తుంటారని సెంటర్ ఫర్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ సంస్థ చెబుతోంది.

దాదాపు 1,100 పదవుల నియమాకాలకు సెనేట్ ఆమెదం తప్పనిసరి. ఈ పదవులను భర్తీ చేయడానికి నెలలు, ఏళ్లు కూడా పట్టవచ్చు.

గత నాలుగేళ్ల అధ్యక్ష పాలనకు సంబంధించిన విధాన పత్రాలు, బ్రీఫింగ్ పుస్తకాలు, వస్తువులను నేషనల్ ఆర్కైవ్స్‌కు తరలిస్తారు. 12 ఏళ్లపాటు అవి అక్కడే రహస్యంగా ఉంటాయి. అయితే, వాటిని ముందే బహిరంగపరచే అధికారం కూడా అధ్యక్షుడికి ఉంటుంది.

కేలీ మెక్ఎనానీ

ట్రంప్ పాలన ఆఖరి వారంలో ఆయన ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ఎనానీ కార్యాలయం ద్వారాలు పాక్షికంగా తెరుచుకునే కనిపించాయి.

ఆమె కార్యాలయంలోని వస్తువులన్నింటినీ ప్యాక్ చేసి, తరలింపుకు సిద్ధంగా పెట్టారు.

వైట్ హౌజ్‌లోని ఫర్నీచర్‌ను, కళాఖండాలను, అలంకార వస్తువులను అలాగే ఉంచుతారు. అధ్యక్షుడి ఫొటోల వంటి వస్తువులను మాత్రం తరలిస్తారు.

ట్రంప్ కుటుంబ సభ్యుల దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువులను వారి కొత్త నివాసానికి తీసుకువెళ్తారు. ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో‌లో ట్రంప్ ఇకపై నివాసం ఉండే అవకాశాలున్నాయి.

ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్

ట్రంప్‌, మిల్లర్ సహా వైట్ హౌజ్‌లో ఇటీవల కరోనావైరస్ సోకినవారు పదుల సంఖ్యలో ఉన్నారు.

వైట్ హౌజ్‌లో ఆరు అంతస్తులు ఉన్నాయి. మొత్తంగా 132 గదుల ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా శుభ్రం చేసి, శానిటైజ్ చేస్తున్నారు.

కొత్త అధ్యక్షుడి కుటుంబం తమ అభిరుచికి తగ్గట్లుగా వైట్ హౌజ్‌లో అలంకరపరమైన మార్పులు చేసుకోవచ్చు.

మరోవైపు ఉపాధ్యక్షుడు పెన్స్ కూడా బుధవారం తన స్థానంలోకి రానున్న కమలా హారిస్ కుటుంబానికి నావల్ అబ్జర్వేటరీ గ్రౌండ్స్‌లో ఉన్న అధికారిక నివాసాన్ని అప్పగిస్తారు. ఇది వైట్ హౌజ్‌కు సుమారు రెండు మైళ్ల దూరంలో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
White House all set to invite the new US President Joe Biden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X