యూఎస్-చైనా చర్చలు ఫెయిల్ ? జిన్ పింగ్ ఓ నియంత అన్న బైడెన్...
అంతర్జాతీయంగా రెండు అగ్రదేశాలు యూఎస్-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య పోరు కాస్తా మాటల యుద్ధంగా మారిపోయిన నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ తాజాగా ఆ దేశంలో పర్యటించారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు కనీస స్ధాయికి దిగజారిపోయిన నేపథ్యంలో బైడెన్ దూతగా వచ్చిన బ్లింకెన్ చైనా దౌత్యవేత్తలతో చర్చించారు. అయితే ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ఉద్దేశించిన ఈ చర్చల్లో ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కరోజు తర్వాత బైడెన్ రెచ్చిపోయారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ను అమెరికా అధినేత జో బైడెన్ ఓ నియంతగా అభివర్ణించారు. ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి సాధారణ స్ధాయికి తీసుకొచ్చేందుకు అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్.. బీజింగ్‌లో పర్యటించిన మరుసటి రోజే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ జీ జిన్‌పింగ్‌ను నియంత అని అభివర్ణించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా గగనతలంపై అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూన్‌ను పేల్చినప్పుడు జిన్ పింగ్ చాలా ఇబ్బందిపడ్డాడని బైడెన్ వెల్లడించారు.

వాస్తవానికి చైనాతో చర్చించేందుకు బీజింగ్ వెళ్లిన అమెరికా దూత ఆంటోనీ బ్లింకెన్.. చైనా బెలూన్ ను అమెరికా పేల్చివేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ అధ్యాయం ముగించాలన్నారు. తద్వారా అమెరికాపై చైనా కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే మరుసటి రోజే బైడెన్ దాన్ని ప్రస్తావిస్తూ జిన్ పింగ్ పై విమర్శలు ఎక్కుపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమయ్యాయన్న వాదన వినిపిస్తోంది.
ఇవాళ కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ..తాను ఆ బెలూన్‌ను రెండు బాక్స్ కార్ల నిండా గూఢచారి పరికరాలతో పేల్చేసినప్పుడు జిన్ పింగ్ కలత చెందాడని, ఇది నియంతలకు చాలా ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. ఏం జరిగిందో వారికి తెలియనప్పుడు పరిస్ధితి ఇలాగే ఉంటుందన్నారు. అలాగే ఆ బెలూన్ అనుకున్న చోటికి వెళ్లలేక దారి తప్పిందన్నారు. అలాగే చైనాకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయన్నారు. ఇప్పుడు బైడెన్ వ్యాఖ్యలతో చైనాతో అమెరికా సంబంధాల పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications