జో బైడెన్ టీమ్‌లో మరో భారతీయురాలికి చోటు- బడ్జెట్ ఛీఫ్‌గా నీరా టాండన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో ఊపుమీదున్న జో బైడెన్ త్వరలో వైట్‌హౌస్‌లో తన పని ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.
అంతకంటే ముందు తన టీమ్ ఏర్పాటు చేసుకుంటున్న బైడెన్.. ఊహించినట్లుగానే ఇందులో భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా భారతీయ మూలాలున్న నీరా టాండన్‌కు తన టీమ్‌లో చోటు కల్పించేందుకు బైడెన్ సిద్దమవుతున్నారు.
జో బైడెన్ తన హయాంలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కీలకమైన మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ టీమ్‌కు డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ నీరా టాండన్‌ను ఆయన ఎంచుకున్నారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న నీరా టాండన్‌ను తన మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్‌గా నామినేట్ చేసేందుకు త్వరలో బైడెన్ ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా పేర్కొంది.

నీరా టాండన్‌తో పాటు ఈ టీమ్‌లో ఆర్ధిక వేత్తలు జేర్డ్ బెర్న్‌స్టైన్, హీతర్ బౌషేను కూడా బైడెన్ నామినేట్ చేయబోతున్నారు. వీరితో పాటు ఒబామా హయాంలో అంతర్జాతీయ ఆర్దిక సలహాదారుగా వ్యవహరించిన వాలీ అడేమోను కూడా బైడెన్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. నీరా టాండన్ విషయానికొస్తే ఆమె దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లి స్ధిరపడ్డారు. ఒబామా హయాం నుంచే టాండన్ డెమోక్రాట్ల తరఫున పనిచేశారు. దీంతో ఇప్పుడు బైడెన్ ఆమెను తన బడ్జెట్ టీమ్‌కు ఛీఫ్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.