న్యూయార్క్ మేయర్‌గా ఫస్ట్ టైమ్ ముస్లిం వ్యక్తి.. ప్రమాణ స్వీకారం అక్కడే ఎందుకంటే ??
న్యూయార్క్ నగర చరిత్రలో ఈరోజు (2026 జనవరి 1వ తేదీ) ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. నగర మేయర్‌గా పరిపాలనా పగ్గాలను జోహ్రాన్ మమ్దానీ అధికారికంగా చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం వినూత్న వేదికపై జరగడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. అంతే కాకుండా అమెరికాలోని అత్యంత ప్రభావవంతమైన నగరానికి నాయకత్వం వహిస్తున్న మొదటి ముస్లిం మేయర్ ఆయనే కావడం గమనార్హం.
ప్రమాణ స్వీకారం ఎక్కడంటే..?
సాధారణంగా మేయర్ల ప్రమాణ స్వీకారం సిటీ హాల్ ప్రాంగణంలో జరుగుతుంది. కానీ మమ్దానీ నగర వారసత్వానికి చిహ్నమైన మాన్‌హాటన్‌లోని పాత 'సిటీ హాల్ సబ్‌వే స్టేషన్'ను వేదికగా ఎంచుకున్నారు. అద్భుతమైన వంపు సీలింగ్‌లకు పేరుగాంచిన ఈ చారిత్రక ప్రదేశంలో.. అమెరికా అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ సమక్షంలో ఆయన ఖురాన్‌పై చేయి ఉంచి ప్రమాణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు సిటీ హాల్ వద్ద జరిగిన బహిరంగ వేడుకలో తన రాజకీయ ఆదర్శం, యూఎస్ సెనేటర్ బెర్నీ సాండర్స్ సమక్షంలో మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

రికార్డుల మేయర్..
జోహ్రాన్ మమ్దానీ బాధ్యతలు చేపట్టడంతో న్యూయార్క్ రాజకీయాల్లో అనేక కొత్త రికార్డులు నమోదయ్యాయి. అమెరికాలోని అత్యంత ప్రభావవంతమైన నగరానికి నాయకత్వం వహిస్తున్న మొదటి ముస్లిం మేయర్ ఆయనే. అంతేకాకుండా దక్షిణాసియా మూలాలు కలిగి ఉండటంతో పాటు ఆఫ్రికాలో జన్మించిన మొదటి మేయర్‌గా కూడా చరిత్రకెక్కారు. కేవలం 34 ఏళ్ల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టి నగర చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌లలో ఒకరిగా నిలిచారు.
కాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్‌లో జీవన వ్యయాన్ని తగ్గించడమే తన ప్రథమ కర్తవ్యమని మమ్దానీ ప్రకటించారు. తన ప్రచారంలో ఇచ్చిన Affordability హామీలను నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉచిత బాలల సంరక్షణ, ఉచిత బస్సు ప్రయాణం, సుమారు పది లక్షల కుటుంబాలకు అద్దె పెంపును నిలిపివేయడం (Rent Freeze) మరియు ప్రభుత్వమే నేరుగా నడిపే కిరాణా దుకాణాల పైలట్ ప్రాజెక్ట్ వంటి వినూత్న పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మమ్దానీ ఉగాండాలోని కంపాళాలో ప్రముఖ చిత్రనిర్మాత మీరా నాయర్, విద్యావేత్త మహమూద్ మమ్దానీ దంపతులకు జన్మించారు. ఏడేళ్ల వయసులో న్యూయార్క్‌కు వలస వచ్చిన ఆయన.. 9/11 అనంతర పరిస్థితుల్లో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇక్కడే పెరిగారు. 2018లో అమెరికా పౌరసత్వం పొంది.. రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసి, ఇప్పుడు నగర మేయర్‌గా ఎదిగారు. ఇప్పటివరకు ఒక బెడ్‌రూమ్ అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉన్న మమ్దానీ, ఆయన భార్య రమా దువాజీ.. ఇప్పుడు మేయర్ అధికారిక నివాసమైన గ్రేసీ మాన్షన్కు మారనున్నారు.
మరోవైపు మమ్దానీ ముందు అనేక సవాళ్లు పొంచి ఉన్నాయి. ఒకవైపు నగర నిర్వహణ బాధ్యతలు, మరోవైపు రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురయ్యే ఫెడరల్ నిధుల కోత వంటి రాజకీయ ఒత్తిళ్లను ఆయన ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ఆయనకున్న విమర్శనాత్మక దృక్పథం వల్ల స్థానిక యూదు కమ్యూనిటీలో కొంత ఆందోళన ఉంది. అయితే పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్‌ను పదవిలో కొనసాగేలా ఒప్పించడం ద్వారా, పోలీసు వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఉండవని వ్యాపార, శాంతిభద్రతల వర్గాలకు ఆయన భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications