కాశ్మీరే సమస్య: షరీఫ్, భారత్ మా మధ్య రావొద్దు: అమెరికాకు చైనా వార్నింగ్
కరాచీ: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య కాశ్మీర్ అంశమే చాలా ప్రధానమైనదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నాడు. ఈ అంశం పరిష్కారమైతే ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందన్నాడు. భారత్ కట్టుబడిన విధంగా ఐక్యరాజ్య సమితి చూపిన పరిష్కారం ప్రకారం కాశ్మీర్ అంశం పరిష్కరించుకోవాలన్నాడు.
బ్రిటిష్ జాతీయ భద్రతా సలహాదారు సర్ మార్క్ లైయాల్ గ్రాంట్‌తో సమావేశమైన షరీఫ్ పై వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, దారుణాలు జరుగుతున్నాయని, వాటిపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలని నవాజ్ షరీఫ్ కోరినట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికాకు చైనా హెచ్చరిక
అమెరికాకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ గతవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. దీనిని చైనా తప్పుబట్టింది. భారత్-చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలో తలదూర్చి వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడవద్దని హితవు పలికింది.
గతవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన వేడుకల్లో భాగంగా రిచర్డ్‌వర్మ తవాంగ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పెమాఖండూ, అస్సాం సీఎం సర్బానంద్ సోనోవాల్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. దీనిపై చైనా మండిపడింది.
అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ ఆ సరిహద్దులో సుమారు నాలుగు వేల కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు ప్రాంతమంతా వివాదాస్పదమైందని పేర్కొంది. దీన్ని రిచర్డ్‌వర్మ సందర్శించడాన్ని తప్పుపట్టింది.
వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని రిచర్డ్ వర్మ సందర్శించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని పేర్కొంది. అమెరికా ప్రవర్తన భారత్-చైనాల మధ్య నెలకొని ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని నష్ట పరిచేదిగా ఉందని, ఈ చర్యతో సమస్యను మరింత జటిలం చేస్తున్నారని పేర్కొంది. అమెరికాకు మేము విన్నవించేది ఒక్కటేనని, దయచేసి భారత్-చైనా సరిహద్దు విషయంలో తలదూర్చవద్దని చెప్పింది.












Click it and Unblock the Notifications