జీవనాడి, వదులుకోం: కాశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: తమ దేశానికి కాశ్మీర్ జీవనాడి అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. గురువారం ముజఫరాబాద్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశంలో షరీఫ్ పాల్గొన్నారు. ఆక్రమిత కాశ్మీర్‌తో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని ఉద్వేగపూరితంగా మాట్లాడారు. హక్కుల కోసం కాశ్మీర్ ప్రజలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
కాశ్మీర్ సమస్య పరిష్కారంతోనే దక్షిణాసియాలో శాంతి స్థాపన జరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. సుమారు 150 కోట్ల మంది ప్రజల జీవితం కాశ్మీర్ అంశంతో ముడిబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ సంఘీభావం దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ఆయన, ‘కాశ్మీర్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చలేని ఏ నిర్ణయాన్నీ పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించదు. ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును కల్పించాల్సిందే'నని షరీఫ్ అన్నారు.

‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాశ్మీరీ ప్రజలు స్వేచ్చా, స్వాతంత్ర్యాలు పొందుతారు'అని షరీఫ్ చెప్పారు. కాశ్మీర్ సమస్యపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని పాక్ రేడియోను ఉటంకిస్తూ షరీఫ్ వెల్లడించారు. పాక్ జాతియ యావత్తు కాశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఆకాంక్షిస్తోందన్న ప్రధాని, అప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కాశ్మీర్‌కు మద్దతు ఇవ్వడం తమ ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆయన అన్నారు.
ఇలా ఉండగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని హురియత్ కాన్ఫరెన్స్ పార్టీలతో అసెంబ్లీ సచివాలయంలో షరీఫ్ సమావేశమయ్యారు. కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం తాము కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా నేతలతో ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగానే సమస్యకు పరిష్కారం చూడాలన్నది ప్రభుత్వం డిమాండ్ అని షరీఫ్ తెలిపారు. కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఏటా ఫిబ్రవరి 5న ‘కాశ్మీర్ సంఘీభావ దినోత్సం' నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications