తొలిసారి పెదవి విప్పిన చోక్సీ: కొత్త కథ..సీబీఐ, ఈడీలపై కిడ్నాప్ ఆరోపణ: భారత్‌లో ముప్పు
సెయింట్ కిట్స్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. ఈ సారి సరికొత్త కథతో తెర మీదికి వచ్చారు. తాను నివసిస్తోన్న అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయిన ఆయన పొరుగుదేశం డొమినికాలో శరీరంపై గాయాలతో తేలాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో ఆయనను డొమినికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని డొమినికా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయన మళ్లీ అంటిగ్వాకు వెళ్లిపోయారు.
ఈ పరిణామాల మధ్య మేహుల్ చోక్సీ తొలిసారిగా స్పందించారు. అంటిగ్వా అండ్ బార్బుడా నుంచి అదృశ్యమైనప్పటి నుంచి డొమినికా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం వరకు చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన పెదవి విప్పారు. సరికొత్త ఆరోపణలను సంధించారు. భారత దర్యాప్తు సంస్థలు తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఎట్టకేలకు తాను అంటిగ్వాకు చేరుకున్నానని, ఈ రెండు నెలల కాలంలో సంభవించిన సవాళ్లు.. తనను తీవ్రంగా గాయపరిచాయని పేర్కొన్నారు. శారీరకంగా, మానసికంగా శాశ్వత గాయాలను మిగిల్చాయని వ్యాఖ్యానించారు.

తన ఆస్తులు, వ్యాపారాలు అన్నీ సీజ్ అయ్యాయని, భారత దర్యాప్తు సంస్థలు తనను అపహరించడానికి ప్రయత్నించాయని అన్నారు. బ్యాంకులను మోసగించిన కేసులో తనను అంటిగ్వా విచారణ జరపాలని సీబీఐ, ఈడీలను విజ్ఞప్తి చేసినట్లు మేహుల్ ఛోక్సీ చెప్పారు. తన ఆరోగ్యం బాగుండట్లేదని, ప్రయాణాలు సాగించడానికి శరీరం సహకరించట్లేదని అన్నారు. అందుకే తనను అంటిగ్వాలోనే విచారణ జరపాలని సీబీఐ, ఈడీలను పలుమార్లు కోరినట్లు చెప్పారు. అయినప్పటికీ- తనను అమానవీయంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాయని ఆరోపించారు. భారత దర్యాప్తు సంస్థల నుంచి ఈ చర్యలను తాను ఏ మాత్రం ఊహించలేదని పేర్కొన్నారు.
Recommended Video
భారత్‌లో తనకు ముప్పు పొంచివున్నట్లు భావిస్తున్నానని, తనకు భద్రత లేదని మేహుల్ చోక్సీ స్పష్టం చేశారు. అందుకే- దర్యాప్తు సంస్థలు అంటిగ్వాలో తనను కస్టడీలోకి తీసుకుని, విచారణ జరిపించుకోవచ్చని అన్నారు. తాను మళ్లీ భారత్‌కు వెళ్తే..సురక్షితంగా తిరిగి వస్తాననే నమ్మకం లేదని తేల్చి చెప్పారు. తాను మళ్లీ సాధారణ స్థితిలో భారత్ నుంచి అంటిగ్వాకు తిరిగి చేరుకుంటాననే గ్యారంటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత 50 రోజుల్లో చోటు చేసుకున్న అనేక పరిణామాలు తనను భయాందోళనలకు గురి చేశాయని చెప్పారు. అంటిగ్వాలో దర్యాప్తును చేపట్టడానికి సహకరిస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications