వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కింగ్ చార్లెస్: గాడున్‌స్టన్‌ బోర్డింగ్ స్కూల్‌లోనే ఎందుకు చదువుకున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

గాడున్‌స్టన్ పాఠశాలలో తమ కుమారుడు, భవిష్యత్‌లో కాబోయే రాజు కింగ్ చార్లెస్ 3 ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు క్వీన్ ఎలిజబెత్ 2, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా వెళ్లినప్పుడు, వారి కోసం ప్రత్యేకంగా కుర్చీలు సిద్ధం చేయించారు. వీటిపై ''మామ్'', ''డాడ్''అని రాయించారు.

మోరేలో స్వతంత్రంగా నడిచే ఈ బోర్డింగ్ స్కూల్‌లో చార్లెస్‌ చేరడం కాస్త అసాధారణమే. రాజ కుటుంబంలో ఇలా ఎవరూ పాఠశాలలకు వెళ్లరు.

ప్రైవేటు ట్యూటర్‌లకు బదులుగా స్కూలుకు వెళ్లి చదువుకున్న తొలి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్. ఇప్పుడు ఆయన రాజుగా మారడంతో.. రాజుకు పాఠాలు చెప్పిన తొలి సీనియర్ స్కూల్‌గా గాడున్‌స్టన్ చరిత్రలో నిలిచిపోతుంది.

నాజీల నుంచి తప్పించుకొని వచ్చిన జర్మన్ యూదు విద్యావేత్త కర్ట్ హన్ 1934లో ఈ పాఠశాలను ప్రారంభించారు. చదువుతోపాటు జీవిత నైపుణ్యాలు, ఇతర సేవలపై అవగాహన కల్పిస్తూ పిల్లలను ఒక పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులుగా మార్చడమే ఈ స్కూలు లక్ష్యం.

1962 మే 2న చార్లెస్‌‌కు స్కూలును చూపిస్తున్న కెప్టెన్ ఇయాన్ టెనంట్

13 ఏళ్ల వయసులో చార్లెస్ ఈ పాఠశాలలో చేరారు.

తొలి రోజు, 1962 మే 1న, తండ్రి ప్రిన్స్ ఫిలిప్‌తోపాటు కలిసి చార్లెస్ ఆర్‌ఏఎఫ్ లాసీమౌత్‌కు విమానంలో వచ్చారు. అక్కడి నుంచి అర మైలు దూరంలో ఉన్న స్కూలుకు ప్రత్యేక వాహనంలో చేరుకున్నారు. ఎలిజబెత్ 2తో వివాహానికి ముందు ఫిలిప్ మొదట ఇక్కడే చదువుకున్నారు.

ఆ తర్వాత ఐదేళ్లు ఇక్కడి పాఠశాలలో చార్లెస్ చదువుకున్నారు. చదువుతోపాటు ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొనేవారు. పడవ నడపడం, నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించడం, విద్యార్థులతో కలిసి పాటలు పాడటం, సంగీత పరికరాలు వాయించడం ఇలా చాలా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉండేవారు.

విలియం షేక్‌స్పియర్ రాసిన మక్‌బెత్ డ్రామాలో రాజుగా చార్లెస్ నటనపై విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. పత్రికల మొదటి పేజీల్లో అప్పట్లో చార్లెస్ ఫోటోతో వార్తలు వచ్చాయి. ఆ ప్రదర్శనను చూసేందుకు క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా కూడా వచ్చారు.

షేక్‌స్పియర్ రాసిన హెన్రీ 5లోని డ్యూక్ ఆఫ్ ఎక్సెటెర్, ద పైరేట్ కింగ్.. ఇలా చాలా పాత్రల్లో చార్లెస్ ఒదిగిపోయారు.

చార్లెస్‌ను ఉత్తమ నటుడిగా సండే టెలిగ్రాఫ్‌కు చెందిన డోనల్డ్ మెక్‌లాక్లన్ అభివర్ణించారు. మరోవైపు డిబేటింగ్ సొసైటీలోనూ చార్లెస్ చురుగ్గా పాల్గొన్నారు. మట్టితో కళాకృతులను కూడా చార్లెస్ చేసేవారు.

పడవలు నడిపే పోటీలు, పర్వత ప్రాంతాల్లో సాహస యాత్రలకు కూడా వెళ్లేవారు. చివరి ఏడాది ఆయన విద్యార్థులకు హెడ్‌గా కూడా మారారు.

స్కూల్ ఆర్కెస్ట్రాలో కింగ్ చార్లెస్ (మధ్యనున్న వ్యక్తి)

1967లో గాడున్‌స్టన్‌ను ఆయన విడిచిపెట్టారు. ఒక మోస్తరు కంటే ఎక్కువ మార్కులతో చార్లెస్ అక్కడి చదువును పూర్తిచేశారు. దీంతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ సబ్జెక్టులలో చదివేందుకు అర్హత సంపాదించారు.

సాధారణంగా భవిష్యత్‌లో కాబోయే రాజులు ''రాజ్యాంగ చరిత్ర'' లాంటి సబ్జెక్టులను ఎంచుకుంటారు. కానీ, చార్లెస్ మాత్రం దీనికి భిన్నమైన సబ్జెక్టుల్లో చదువుకున్నారు.

చార్లెస్‌కు గాడున్‌స్టన్ స్కూలు అసలు నచ్చేదికాదని, అక్కడి వాతావరణానికి ఆయన అలవాటు పడలేకపోయారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

అయితే, వాటిలో ఎలాంటి నిజమూలేదని చార్లెస్ ఖండించారు. 1975లో పార్లమెంటులో మాట్లాడేటప్పుడు, ఈ విషయంపై ఆయన స్పందించారు. ''గాడున్‌స్టన్ పాఠశాలలో నా విద్యాభ్యాసం గురించి రాసిన తప్పుడు వార్తలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది''అని ఆయన అన్నారు.

''కాస్త కఠినంగా ఉండే మాట వాస్తవమే. ఎందుకంటే మనం కాస్త ఎక్కువగా ఏకాగ్రత పెట్టాల్సి ఉంటుంది. ఇతర పాఠశాలలతో పోల్చినప్పుడు శారీరకంగా, మానసికంగా కొంచెం ఎక్కువ శ్రద్ధ అక్కడ అవసరం అవుతుంది''అని ఆయన వివరించారు.

''నా గురించి నేను తెలుసుకోవడంతోపాటు నా శక్తి సామర్థ్యాలను నాకు పరిచయడం చేయడంలో ఆ పాఠశాల చాలా తోడ్పడింది. సవాళ్లను స్వీకరించడం, చొరవ తీసుకోవడం లాంటి ఎన్నో అంశాలు అక్కడ నేర్చుకున్నాను''అని చార్లెస్ తెలిపారు.

మరోవైపు గాడున్‌స్టన్‌లో చదువుకోవడం నిజంగా తన అదృష్టమని ద అబ్జర్వర్‌తోనూ చార్లెస్ చెప్పారు.

''నేను ఆ స్కూలులో ఇంకా ఎక్కువ ఆనందంగా గడపొచ్చు. అయితే, నాకు అన్నింటి కంటే మా ఇల్లే ఎక్కువ సంతోషాన్నిస్తుంది''అని ఆయన అన్నారు.

''కానీ గాడున్‌స్టన్ వల్ల స్వీయ నియంత్రణ, సంకల్ప బలం, క్రమశిక్షణ అలవాటు అయ్యాయి. మాకు సొంతంగా అగ్నిమాపక దళం ఉండేది. సముద్రం లేదా పర్వత ప్రాంతాల్లో ఆపదలో ఉన్న వారిని రక్షించడం ఇలా చాలా నేర్చుకున్నాం''అని ఆయన వివరించారు.

గాడున్‌స్టన్‌లో విద్యార్థులు రోజూ ఉదయం 50 నుంచి 100 యార్డుల దూరం పరిగెత్తాలి. ఆ తర్వాత వేడి నీళ్లు, ఆ తర్వాత చల్ల నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది.

చార్లెస్ 30వ పుట్టిన రోజునాడు ఒక పత్రికలో ఈ స్కూలుతో ఆయన అనుబంధం గురించి ఒక వార్త ప్రచురించారు. ఇక్కడి కఠిన శిక్షణకు చార్లెస్ అలవాటు పడేందుకు చాలా కష్టపడ్డారని అందులో పేర్కొన్నారు. కర్ట్ రూపొందించిన నాయకత్వ లక్షణాలు, స్వీయ నియంత్రణపై శిక్షణ చార్లెస్‌ను ఆకట్టుకున్నాయని వివరించారు.

చార్లెస్ జీవితాన్ని కర్ట్ బోధనా ప్రణాళిక చాలా ప్రభావితం చూపిందని ఆ కథనంలో వివరించారు. చేపలను పట్టడం, హాకీతోపాటు క్రికెట్ ఆడటాన్ని కూడా చార్లెస్ ఆస్వాదించేవారని పేర్కొన్నారు. చార్లెస్‌కు ఇష్టంలేని సబ్జెక్ట్ అంటే గణితమని వివరించారు.

గాడున్‌స్టన్‌లో చదువుకునేటప్పుడు చార్లెస్ విండ్‌మిల్ లాడ్జ్‌లో ఉండేవారు. ఇప్పుడు దీన్ని బాలికల బోర్డింగ్ హౌస్‌గా మార్చారు.

చుట్టుపక్కల పరిసరాలతో పోల్చినప్పుడు ఈ ప్రాంతం కాస్త వేడిగా, ఆహ్లాదంగా ఉంటుందని చార్లెస్‌తోపాటు గడిపిన వారు చెబుతుంటారు.

''విండ్‌మిల్ లాడ్జిలో హాస్ హెల్పర్ మినహా అందరూ డార్మిటరీల్లోనే నిద్రపోయేవారు. చిన్న డార్మిటరీల్లో నాలుగు పడకలు, పెద్దవాటిలో ఆరు పడకలు ఉంటాయి. కొన్నింట్లో ఎనిమిది పడకలు కూడా ఉండేవి. చార్లెస్ కూడా వీటిలోనే నిద్రపోయేవారు''అని ఒక పూర్వ విద్యార్థి వివరించారు.

''అక్కడ బెడ్లకు కూడా ఐడీ కార్డులు ఉండేవి. అవి చాలా ప్రశాంతంగా ఉండేవి. వాటి విషయంలో ఎలాంటి ఫిర్యాదులూ ఉండేవి కాదు''అని ఆయన చెప్పారు.

1966లో విద్యార్థుల మార్పిడి పర్యటనలో భాగంగా ఒక ఆస్ట్రేలియా పాఠశాలకు కూడా చార్లెస్ వెళ్లారు. ఆ పాఠశాల గాడున్‌స్టన్ కంటే కఠినంగా ఉండేదని, కానీ, తనకు నచ్చిందని చార్లెస్ వివరించారు.

ప్రతి వారాంతం అటవీ ప్రాంతంలో సాహస యాత్రకు చార్లెస్ వెళ్లేవారు. తన అనుభవాలను స్కూల్ మ్యాగజైన్‌లో ఆయన వివరించారు. ''ఇక్కడ చాలా చెట్లను నరికేస్తున్నారు. అయితే, పిల్లలకు వేడినీళ్లు పెట్టాలంటే ఇది తప్పనిసరి. మరోవైపు వంట చేయడానికి కూడా చాలా కలప అవసరం''అని ఆయన పేర్కొన్నారు.

''ఇక్కడకు వచ్చిన మొదటివారం నేను కూడా కలపను తీసుకు రావడానికి వెళ్లాను. తిరిగి వచ్చాక చూసుకుంటే నా చేయిపై చాలా గాయాలు కనిపించాయి''అని ఆయన తెలిపారు.

గాడున్‌స్టన్ డైనింగ్ హాల్

గాడున్‌స్టన్ స్కూలులో చదువుకునేటప్పుడు చార్లెస్‌కు ఒక సారి న్యుమోనియా కూడా సోకింది. మరోవైపు స్కూలు పిల్లలతో రగ్బీ ఆడేటప్పుడు ఆయన ముక్కుకు గాయమైంది.

1963 జూన్‌లో లెవీస్ ద్వీపంలోని ఓ హోటల్‌లో చార్లెస్.. చెర్రీ బ్రాందీ తాగిన ఘటన చర్చనీయాంశమైంది. ఆ వయసులో పిల్లలు ఆల్కహాల్ తాగడానికి అనుమతి లేదు. మరోవైపు గాడున్‌స్టన్ పిల్లలు ఆల్కహాల్ తాగకూడదని ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. ఈ విషయంపై చార్లెస్‌తో స్కూల్ హెడ్ టీచర్ గట్టిగా మాట్లాడినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.

ఈ ఘటనపై ఒక రేడియో ఇంటర్వ్యూలో చార్లెస్ స్పందించారు. ''భోజనం కోసం కూర్చున్నప్పుడు అందరూ నావైపే అలా చూస్తున్నారు. వారి నుంచి తప్పించుకోవడానికి నేను బార్‌లోకి వెళ్లిపోయాను''అని చార్లెస్ చెప్పారు.

అంతకుముందెన్నడూ ఆయన బార్‌లోకి వెళ్లలేదు. ''నా వైపుగా వచ్చిన డ్రింక్‌ను ముందు నేను తీసుకున్నాను. అది చెర్రీ బ్రాందీ. కొంచెం తాగగానే నా చుట్టుపక్కల ప్రపంచం విస్ఫోటం చెందినట్లు అనిపించింది. అంతే..''అని ఆయన అన్నారు.

గాడున్‌స్టన్‌లో ఉండేటప్పుడు చార్లెస్.. ఇతరులకు సేవ చేయడం, ప్రకృతిలో గడపడం లాంటివి చేసేవారని పాఠశాల ప్రిన్సిపల్ లీసా కెర్ చెప్పారు.

''ఆర్కియాలజీపై ఇక్కడే ఆయన ప్రేమను పెంచుకున్నారు. మంచి నటుడిగా, మట్టితో కళాకృతులు చేసే కళాకారుడిగా ఆయన మారారు''అని ఆమె వివరించారు.

''కోస్ట్‌గార్డ్ సర్వీస్‌ ద్వారా ప్రజలకు చార్లెస్ సేవ చేసేవారు. ఆయనతోపాటు ఇక్కడ చదువుకున్నవారు ఎవరిని అడిగినా.. ఆయన మంచి విద్యార్థని చెబుతారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన వచ్చిన తర్వాత, ఆయన మరింత చురుగ్గా ఉండేవారు. ఆయన రాజుగా కూడా మెరుగ్గా సేవలందించాలని మేం కోరుకుంటున్నాం''అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
King Charles: Why did you study at Gordonston Boarding School?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X