విషాదం: యువతి ప్రాణం తీసిన సెల్పీ సరదా
లండన్: ఇటీవలి కాలంలో సెల్ఫీలు సరదా పెరిగిపోయింది. అయితే ఆ సరదా సాహసంగా మారి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా సెల్ఫీ కోసం సాహసం చేసిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. రుమేనియాకు చెందిన ఓ యువతి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు పైకి ఎక్కడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడింది.
అన్నా ఉర్సు (18) అనే యువతి రైలు పైన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని సరదా పడింది. ఆ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాలని భావించింది. అనుకున్న తడవుగా అన్నా తన స్నేహితురాలితో కలసి లాసి పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఇద్దరూ కలసి రైలుపైకి ఎక్కారు.

ఈ క్రమంలో అన్నా ఉర్సు హై టెన్షన్ విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లడంతో షాక్ తగిలింది. ఆమె దుస్తులకు మంటలు అంటుకోగా, మరో స్నేహితురాలి రైలుపై నుంచి పడిపోయింది. ఈ సంఘటనను గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ప్రాణాలకు తెగించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. రైలుపైకి ఎక్కి ఆమె దుస్తులపై మంటలను ఆర్పివేశాడు. ఇద్దరు అమ్మాయిలను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉర్సు శరీరం 50 శాతంపైగా కాలిపోయి తీవ్రగాయాలు కావడంతో మరణించింది. ఆమె స్నేహితురాలి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.












Click it and Unblock the Notifications