Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెజాన్ అడవిలో ఒంటరి పైలట్: అనకొండలు, పులులు, మొసళ్లను తప్పించుకుంటూ 36 రోజులు గడిపాడు

ఆంటోనియోను రక్షించిన రైతులు

అది బ్రెజిల్‌లోని దట్టమైన అమెజాన్ అడవి. మనుషులెవరూ పెద్దగా తిరగని ప్రాంతం. క్రూర మృగాలు, మొసళ్లు, అనకొండలు సంచరించే ప్రమాదకర ప్రదేశం.

అక్కడ ఒక పైలట్. అది కూడా ఒంటరిగా. పేరు ఆంటోనియో సేనా.

అడవి నుంచి బయటకు వెళ్లడానికి దారి తెలియదు.

ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఓవైపు.

ఏ క్రూరమృగానికి ఆహారంగా మారిపోతానేమోననే భయం మరోవైపు.

మళ్లీ ఇంటికి వెళ్తానా లేదా అనే ఆందోళన.. ఇలా ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. 36 రోజుల పాటు క్షణ క్షణం భయం భయంగా గడిపారు ఆంటోనియో.

అమెజాన్ అడవులు క్రూర జంతువులకు నిలయాలు

దట్టమైన అడవిలో క్రాష్ ల్యాండింగ్

ఆంటోనియో ఒక పైలట్. ఆయన నడుపుతున్న విమానం అడవిలో క్రాష్‌ల్యాండ్ అయింది.

కొన్ని నెలల క్రితం మారుమూల ప్రాంతంలో ఉన్న గనుల దగ్గరకు ఒంటరిగా విమానంలో సరుకులు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చెట్ల కొమ్మల మధ్యలోంచి ఆయన ఆ విమానాన్ని సురక్షితంగా దించగలిగారు.

విమానం కూలే ముందు "మే డే, మే డే, పాపా, టాంగో, ఇండియా, రోమియో, జూలియట్ కూలిపోతున్నాడు" అనే రేడియో సందేశాన్ని ఆంటోనియో చివరగా పంపించారు.

"గనుల ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ దూరంలో విమానం ఇంజన్ పని చేయడం ఆగిపోయింది. దాంతో విమానాన్ని అడవి మధ్యలో ల్యాండ్ చేయవలసి వచ్చింది" అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఆ అడవిలో బతకడానికి ఆహారం కోసం, నీళ్ల కోసం, తల దాచుకోవడానికి సురక్షితమైన ప్రాంతం కోసం ఆయన చాలా కష్టపడాల్సి వచ్చింది.

తనను ఎవరైనా రక్షిస్తారేమోనని ఆంటోనియో కొన్ని రోజులు ఎదురుచూశారు. కానీ ప్రతిరోజూ ఆయనకు భయానక అనుభవమే మిగిలింది.

అలాంటి దట్టమైన అడవుల్లో ఆహారం వెతుక్కుంటూ, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, నెల రోజులకుపైగా తనను తాను కాపాడుకోవలసిన పరిస్థితి వస్తుందని ఆంటోనియో ఎప్పుడూ ఊహించలేదు.

అమెజాన్ అడువుల్లో మొసళ్లు, చిరుతలు, అనకొండా లు తిరుగుతుంటాయి.

ఎదురు చూసిన సమస్యలు

విమానం పడిపోయిన ప్రాంతం అమెజాన్ నదికి ఉత్తర దిక్కుగా ఉంది. ఈ ప్రమాదంలో ఆయన మరణాన్నైతే తప్పించుకున్నారు. కానీ అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి. విమానంలో ఉన్న ఇంధనమంతా లీక్ అయిపోయింది.

"నేనున్న ప్రమాదకర స్థితిలో ఆ విమానాన్ని అక్కడ వదిలేయడం తప్ప వేరే మార్గం లేదు" అని అన్నారు ఆంటోనియా.

ఆ విమానం లోపల తల దాచుకోవడానికి వీలులేకపోయింది. దాంతో అక్కడకు దగ్గరలోనే చెట్లపై ఉండిపోయారు. రేడియోలో తాను పంపిన ఆఖరి సందేశం విని ఎవరైనా సహాయం చేసేందుకు వస్తారని అనుకున్నారు.

"ఆ అడవిలో నేను 5 నుంచి 8 రోజులు ఉండాల్సి వస్తుందేమో అనుకున్నాను. సాధారణంగా ఎవరినైనా వెతికి పట్టుకోవడానికి రక్షణ బృందాలకు పట్టే సమయం అది. కానీ రోజులు గడుస్తున్నా ఎవరూ రాలేదు" అని వివరించారు ఆంటోనియో.

ఒంటరి ప్రయాణం

ఆప్తులను తిరిగి కలుసుకోవాలంటే ముందు ఆ విమానం కూలిన ప్రాంతం నుంచి కదలడం మొదలుపెట్టాలని ఆంటోనియో నిర్ణయించుకున్నారు.

అడవి నుంచి బయటపడే మార్గం వెతుక్కుంటూ ఆయన నడవడం మొదలుపెట్టారు.

"రెస్క్యూ బృందాలు నన్ను కనిపెట్టలేకపోయాయని అర్థమైంది. ఇక ఆ ప్రాంతాన్ని ఎలాగైనా దాటి నా కుటుంబాన్ని చూడాలని అనుకున్నాను" అని ఆయన చెప్పారు.

సూర్యుడు ఉదయించగానే, వెలుగు కిరణాలు వచ్చే వైపు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టి, జనావాసాలు ఉన్న ప్రాంతానికి చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు ఆంటోనియో. ప్రతి రోజూ తూర్పు దిక్కుగా రెండు నుంచి నాలుగు గంటల పాటు నడిచారు.

"అలా నడుస్తూ వెళ్లిన తర్వాత రాత్రికి ఎక్కడ ఉండాలో, ఎక్కడ తల దాచుకుని, మంట కాచుకోవాలో ఆలోచించాల్సి వచ్చేది" అని ఆయన చెప్పారు.

రవాణా, కమ్యూనికేషన్ లేని అమెజాన్ అడవుల్లో ఇలా ఒంటరిగా ఉండటం చాలా కష్టమైన విషయమే. కానీ అడవుల్లో తనను తాను కాపాడుకునేందుకు ఆంటోనియో కొన్ని మెళకువలు నేర్చుకున్నారు.

"వైమానిక దళ శిక్షణ సమయంలో అడవుల్లో స్వీయ రక్షణకు అవసరమైన ట్రైనింగ్ తీసుకున్నాను. నేను అమెజాన్‌ ప్రాంతంలోనే పుట్టాను. కొంత కాలం అక్కడున్న అనుభవం నాకు నాకుంది’’ అని చెప్పుకొచ్చారాయన.

అడవుల్లో మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజల దగ్గర నుంచి గతంలో ఆయన కొంత సమాచారం తెలుసుకున్నారు. అదే ఇప్పుడు ఆయనకు పనికొచ్చింది.

"ఆ అడవుల్లోకి వెళ్లినప్పుడల్లా అక్కడి ప్రజలతో మాట్లాడేవాడిని. వాళ్ల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు" అని ఆంటోనియో చెప్పారు.

అడవి

అడవుల్లో నేర్చుకున్న విషయాలు ఆహారం సేకరించుకునేందుకు ఆయనకు బాగా పనికొచ్చాయి.

"జీవితంలో ఎప్పుడూ చూడని పండ్లు కనపడ్డాయి. వాటిని కోతులు తినడం చూశాను. కోతులు తినగల్గుతున్నాయంటే, మనిషి కూడా తినొచ్చనే ఉద్దేశ్యంతో తినడం మొదలుపెట్టాను" అని ఆంటోనియో చెప్పారు.

కొన్నిసార్లు కోకో కూడా దొరికేది. కానీ కేవలం పండ్లతో కడుపు నిండేది కాదు. దాంతో అడవిలో ఉండే ఒకరకం పక్షి పెట్టే గుడ్లను తిని ఆకలి తీర్చుకున్నానని వివరించారు.

ఈము పక్షుల తరహాలో ఉండే ఈ పక్షులు నీలం రంగులో పెద్ద పెద్ద గుడ్లు పెడతాయని చెప్పారు.

ఈ గుడ్లు అప్పుడప్పుడూ దొరికేవి. వాటిని అలా పచ్చిగానే తినేవారు. అలా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సంపాదించుకున్నారు.

అమెజాన్ అడవులలో ప్రాణాలు రక్షించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.

క్రూరమృగాల కోరల నుంచి...

అడవిలో తినడానికి ఏదో ఒక ఆహారం దొరుకుతున్నప్పటికీ.. ఆంటోనియోకు మరొక సమస్య వచ్చి పడింది.

అదే క్రూర మృగాల నుంచి తనను తాను కాపాడుకోవడం.

అమెజాన్ అడవుల్లో అనేక రకాల క్రూరమృగాలు ఉంటాయి. ఎటు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందో తెలియదు.

అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది.

"నేను ప్రతిరోజు రాత్రి పూట కొండల మీదే గూడు కట్టుకునేవాడిని. అక్కడే పడుకునేవాడిని. ఎందుకంటే చిరుతలు, మొసళ్లు, అనకొండలు నీటి పరిసరాల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అందుకే నదీ పరీవాహక ప్రాంతాల దగ్గర ఎప్పుడూ క్యాంప్ చేయలేదు" అని చెప్పారు.

అడవిలో నడుస్తున్నప్పుడు రకరకాల శబ్దాలు చేశారు ఆంటోనియో. ఎందుకంటే ఆ శబ్దాలు విని జంతువులు తన దగ్గరికి రాకుండా ఉంటాయని ఆయన నమ్మకం.

https://www.instagram.com/p/CMIoYQJpSHr/

ఆశే ఆలంబనగా…

ఆంటోనియో అడవిలో ఉండేందుకు పాటిస్తున్న మెలకువలు పని చేస్తున్నప్పటికీ, ఆయన చాలా బరువు తగ్గిపోయారు. ఆయన విమానం కూలిన చోటును వదిలిపెట్టి, కొన్ని వారాలు గడిచాయి.

36 రోజుల తర్వాత ఆయనకు కొంతమంది మనుషులు కనిపించారు.

"అడవిలో నడుస్తూ, కొండలు ఎక్కుతూ, నదీ ప్రాంతాలను దాటుతూ, ఒక నిర్జన ప్రదేశంలో బ్రెజిల్ నట్స్‌ను సేకరించే వ్యక్తులను కలిసాను" అని ఆయన చెప్పారు.

ముందు వాళ్లు కనపడలేదు. కానీ వాళ్లు చేస్తున్న శబ్దాలను వింటూ నడుచకుంటూ వెళ్లిన ఆంటోనియో మొత్తానికి వాళ్లను కలిశారు.

దీంతో ఆయన ఇన్ని రోజులు పడిన కష్టాలు ఒక కొలిక్కి వచ్చాయి.

"ఒకవైపు ఆకలి, నొప్పులు బాధపెడుతున్నా తన కుటుంబాన్ని తిరిగి చూడాలనే ఆశే తనను ముందుకు నడిపించింది" అని ఆయన చెప్పారు.

"అడవి నుంచి బయటకు వచ్చి, ఎయిర్ పోర్టులో నా కుటుంబాన్ని కలుసుకోవడం నా జీవితంలో మర్చిపోలేని క్షణం" అని అన్నారు ఆంటోనియో.

ఆయనను వెతికేందుకు అనేక విమానాలు, హెలికాఫ్టర్లను పంపించినప్పటికీ, అవి కొన్ని వారాల ముందే వెతకడాన్ని ఆపేశాయి.

ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆంటోనియో నడుచుకుంటూ రాకపోయి ఉండుంటే, ఆయన తన కుటుంబాన్ని ఎప్పటికీ కలుసుకునే వారు కాదు.

"నేనిదంతా వాళ్ల కోసమే చేశాను. వాళ్లనే తలచుకుంటూ ముందుకు కదిలాను" అన్నారు ఆంటోనియో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+