పండగ వేళ.. యూజర్లకు అమెజాన్ బిగ్ షాక్..!!
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్రాష్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దీని సేవలు స్తంభించిపోయాయి. గ్లోబల్ అవుటేజ్ ఏర్పడింది. ఫెస్టివల్ సీజన్ ఆఫర్లు నేటితో ముగియాల్సి ఉన్న నేపథ్యంలో కోట్లాదిమంది యూజర్లు ఒక్కసారిగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద ఆధారపడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అనేక ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు సైతం అంతరాయాలను ఎదుర్కొన్నాయి.
దీనికి సంబంధించిన వివరాలను అవుటేజ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డెటెక్టర్ వెల్లడించింది. అమెజాన్ క్లౌడ్ విభాగం ఏడబ్ల్యూఎస్ తో పాటు, రాబిన్‌హుడ్, స్నాప్‌చాట్, పెర్‌ప్లెక్సిటీ AI వంటి సేవలు కూడా ప్రభావితం అయ్యాయి. ఆయా అంతరాయాలన్నింటికీ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ మూల కారణమని డౌన్ డిటెక్టర్ అంచనా వేసింది. ఈ క్లౌడ్ విభాగం నుంచే ఆయా సంస్థలకు ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ మౌలిక సదుపాయాలు లభిస్తాయని వివరించింది.

అమెరికాలో AWS సర్వీసులు స్తంంభించినట్లు రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయని డౌన్ డెటెక్టర్ పేర్కొంది. యూజర్లు వివిధ రకాల డిజిటల్ సర్వీసులు, యాప్‌లను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అమెజాన్ సొంత ప్లాట్‌ఫామ్‌లు - అమెజాన్.కామ్, ప్రైమ్ వీడియో, అలెక్సా కూడా కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నాయని ఈ వెబ్ సైట్ తెలిపింది.
పెర్‌ప్లెక్సిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. పెర్‌ప్లెక్సిటీ సేవల్లో గ్లోబల్ అవుటేజ్ ఏర్పడిందని, దీనికి AWSలో తలెత్తిన సాంకేతిక సమస్యలే ప్రధాన కారణమని అన్నారు. ఈ క్రాష్, అవుటేజ్.. తమ కంపెనీ కార్యకలాపాలను తాత్కాలికంగా ప్రభావితం చేసిందని స్పష్టం చేశారు. ఆయా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లతో పాటు పేపాల్‌కు చెందిన పీర్-టు-పీర్ చెల్లింపుల సేవ వెన్మో సహా అనేక ఇతర ప్రముఖ యాప్‌లు, వెబ్‌సైట్‌లు స్తంభించిపోయాయి.
స్నాప్‌చాట్, క్రంచీరోల్, రోబ్లాక్స్, వాట్‌నాట్, రెయిన్‌బో సిక్స్ సీజ్, కాయిన్‌బేస్, కాన్వా, డ్యుయోలింగో, గుడ్‌రీడ్స్, రింగ్, ది న్యూయార్క్ టైమ్స్, లైఫ్360, ఫోర్ట్‌నైట్, యాపిల్ టీవీ, వెరిజోన్, చైమ్, మెక్‌డొనాల్డ్స్ యాప్, కాలేజ్‌బోర్డ్, వర్డల్, పబ్జీ బ్యాటిల్‌గ్రౌండ్స్ వంటి AWS సర్వర్‌లపై ఆధారపడిన అనేక డిజిటల్ టూల్స్, ప్లాట్‌ఫారమ్‌లలో సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వాటిల్లో కొన్ని సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించినప్పటికీ మధ్యాహ్నం వరకు యూజర్లు యాక్సెస్ సమస్యలను ఎదుర్కొంటూనే వచ్చారు. దీనిపై అమెజాన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.












Click it and Unblock the Notifications