టీటీడీలో మరో కీలక నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీలో మరో కీలక నియామకం చోటు చేసుకుంది. ఇదివరకు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా పని చేసిన బీఆర్ నాయుడు రెండేళ్ల వ్యవధి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ అథారిటీని నియమించింది. ఛైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారీ అథారిటీలో. ఇటీవలే దీని ఛైర్మన్ గా టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అథారిటీ సభ్యుడు నియమితులయ్యారు.
స్పెసిఫైడ్ అథారిటీ సభ్యుడిగా దేవాదాయశాఖ కార్యదర్శి కే కన్నబాబు నియమితులయ్యారు. శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకులవారి మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి పిలుపు, అనుగ్రహంతో ఆయనకు సేవ చేసే ఈ గొప్ప అవకాశం లభించిందని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి సాధికారిక మండలి సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, శక్తిమేరకు పూర్తిస్థాయిలో సేవలందిస్తానని అన్నారు.
స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ముద్దాడ రవిచంద్ర ఆధ్వర్యంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలను కల్పించడానికి, శ్రీవారి ఆలయ ధార్మికత, విశిష్టతను ఖండాంతరాలకు విస్తరించేలా భక్తిశ్రద్ధలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని కన్నబాబు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు.













Click it and Unblock the Notifications
