నెతన్యాహు అవుట్: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా: రాత్రికి రాత్రి.. !!
ఇజ్రాయెల్ లో దశాబ్దాల కాలం పాటు కొనసాగిన బెంజమిన్ నెతన్యాహు పాలనా శకానికి తెరపడనుంది. ఆయన పదవి కోల్పోయారు. మాజీ కానున్నారు. ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు గడీ ఐసెన్‌కోట్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐసెన్‌కోట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. తనకు మద్దతు ఇస్తోన్న పార్లమెంట్ సభ్యుల సంతకాలతో కూడిన జాబితాను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కు అందజేయగా.. దీన్ని ఆయన ఆమోదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కోట్ ను ఆహ్వానించారు.
నూతన ప్రధానిగా గాదీ ఐసెన్‌కోట్ ప్రమాణస్వీకారం చేసే తేదీ, సమయం తదితర వివరాలను ఇజ్రాయెల్ అధ్యక్ష భవనం త్వరలోనే ప్రకటించనుంది. కిందటి నెల 27వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గడీ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 120 మంది సభ్యులుండే ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 మంది సభ్యుల మెజారిటీ అవసరం.

ఐసెన్‌కోట్ కూటమి సొంతంగా 48 స్థానాలు సాధించింది. ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుతో స్పష్టమైన మెజారిటీ సాధించగలిగింది. ఈ నూతన కూటమి ఏర్పాటులో అరబ్ రాజకీయ పార్టీల మద్దతు నిర్ణయాత్మకంగా మారింది. జాయింట్ లిస్ట్‌లోని హదాష్, తాల్, బలద్ పార్టీలతో పాటు వేరుగా పోటీ చేసిన రాహెమ్ పార్టీకి చెందిన మొత్తం 19 మంది అరబ్ పార్లమెంట్ సభ్యులు ఐసెన్కోట్కు తమ మద్దతు తెలిపారు. వారి సంతకాలు, లేఖలను అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సమర్పించడంతో ఐసెన్కోట్కు అనుకూలంగా ఉన్న ఎంపీల మొత్తం సంఖ్య 67కు చేరింది. మేజిక్ ఫిగర్ కంటే ఆరుమంది సభ్యుల అదనపు బలం కూటమికి ఉంది.
కూటమి ఏర్పాటు ఒప్పందంలో భాగంగా గాదీ ఐసెన్‌కోట్ కొన్ని స్పష్టమైన విధానపరమైన ప్రాధాన్యతలను ఖరారు చేశారు. ఇజ్రాయెల్‌ను యూదుల రాజ్యంగా కొనసాగిస్తూనే, పౌరుల హక్కులను పరిరక్షించే ప్రజాస్వామ్య వ్యవస్థ ఆధారంగా పాలన సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశ ఆవిర్భావ సమయంలో పొందుపరిచిన ప్రాథమిక పౌర హక్కులు, రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తామని అరబ్ పార్టీల నేతలకు హామీ ఇచ్చారు.
నూతనంగా అధికారంలోకి రానున్న ప్రభుత్వం ప్రాంతీయ భద్రత విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంబించనుంది. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తూనే, దాని సైనిక శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రాధాన్యతగా ఇస్తానని ఐసెన్‌కోట్ స్పష్టం చేశారు. దేశ సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, అంతర్గతంగా పౌరుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీధోరణి ఉండబోదని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా వివాదాలకు కేంద్రబిందువుగా ఉంటూ వచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ నిబంధనలలో సమగ్ర మార్పులు తీసుకువస్తాననీ ఆయన పేర్కొన్నారు.
దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఈ నిబంధనలు ఉండబోతాయని ఐసెన్‌కోట్ పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు మధ్యప్రాచ్య ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలలో ఎంతో కీలక మలుపుగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. భారత్ తో స్నేహ సంబంధాలు ఎలా ఉంటాయనేదీ చర్చనీయాంశమౌతోంది.













Click it and Unblock the Notifications
