తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్ కూడా అందులో ఉన్నారు.
ప్రస్తుతం ట్రంప్ బ్రిటన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నేటితో ఆయన మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈ క్రమంలో లండన్ విండ్సర్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో స్టాన్ సెడ్ విమానాశ్రయానికి బయలుదేరారు. ఆ ఎయిర్ పోర్ట్ లోనే ఎయిర్ ఫోర్స్ వన్ ను నిలిపివుంచారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ అది.

టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికి హెలికాప్టర్‌లో హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. దీంతో పైలెట్లు ఎయిర్‌ఫీల్డ్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. 20 నిమిషాల తర్వాత మరో హెలికాప్టర్ లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా.. స్టాన్ సెడ్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన వల్ల ట్రంప్ అధికారిక కార్యక్రమాల్లో జాప్యం చోటు చేసుకుంది.
ఈ వివరాలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లివిట్ వెల్లడించారు. హైడ్రాలిక్ సమస్య కారణంగా డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ను పైలెట్లు ఎయిర్‌ఫీల్డ్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారని ఆమె వివరించారు. వారిద్దరూ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌లో ప్రయాణించారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టాన్ సెడ్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారని లీవిట్ మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.
ట్రంప్ తన యూకే పర్యటన సందర్భంగా బిజీ బిజీగా గడిపారు. ఆ దేశ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌తో ముఖాముఖి భేటీ అయ్యారు. జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో- ట్రంప్ భారత్‌తో తనకున్న సన్నిహిత సంబంధాలను కూడా ప్రస్తావించారు. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీతో తన వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపాననీ అన్నారు.












Click it and Unblock the Notifications