వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Mother's Day: మాతృ దినోత్సవాన్ని మొదలుపెట్టింది ఈమే.. దీన్ని రద్దు చేయాలని మొదట్లో డిమాండ్ చేసిందీ ఈమే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అన్నా జార్విస్ 1900

ఏటా మే రెండో ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మదర్స్ డే నిర్వహిస్తారు.

ఈ ఏడాది ఈ దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నిరాడంబరంగా జరుగుతోంది. ఈ దినోత్సవాన్ని ప్రారంభించిన మహిళ ఈ నిరాడంబరాన్ని చూస్తే బహుశా సంతోషించేవారు.

ఎందుకంటే.. మదర్స్ డేను అత్యంత ఆడంబరంగా మార్చి, పూర్తిగా వాణిజ్యమయం చేసినతీరుతో ఆమె ఏకంగా ఈ దినోత్సవాన్ని రద్దు చేయాలన్న ప్రచారాన్ని ప్రారంభించేంతగా ఆవేదన చెందారు.

ఎలిజబెత్ బర్‌కు కొద్ది రోజుల కిందట ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినవారు ఆమె కుటుంబ చరిత్ర అడిగారు.

దాంతో ఆమె ఎవరో మోసగాళ్లే కాల్ చేశారని అనుకున్నారు. ''నా ఐడెంటిటీని ఎవరో దొంగిలించారు. ఇక నా డబ్బు నేను మళ్లీ కళ్లజూడడం కష్టమే’’ అనుకున్నాను అన్నారు ఎలిజబెత్.

నిజానికి అది మోసగాళ్లు చేసిన కాల్ కాదు.. కుటుంబ చరిత్రలను పరిశోధించే ఓ వ్యక్తి అన్నా జార్విస్ బంధువుల కోసం వెతుకుతూ చేసిన ఫోన్ కాల్ అది.

అన్నా జార్విస్ అంటే సుమారు శతాబ్దం కిందట అమెరికాలో 'మదర్స్ డే’ను తొలిసారి స్థాపించిన మహిళ. అన్నా జార్విస్ తన తల్లిదండ్రుల 13 మంది సంతానంలో ఒకరు.

ఆ పదమూడు మందిలో తొమ్మిది మంది చిన్నతనంలోనే మరణించారు. ఇక మిగిలిన నలుగురిలో అన్నా జార్విస్ పెద్దన్న ఒక్కరికే పిల్లలున్నారు. అందులోనూ చాలామంది చిన్నతనంలోనే టీబీ, ఇతర కారణాలతో చనిపోయారు.

ఆయన చిట్టచివరి వారసుడు/వారసురాలు 1980లో మరణించారు.

దీంతో 'మై హెరిటేజ్’కు చెందిన ఎలిజబెత్ జెట్లాండ్.. జార్విస్ కుటుంబ కజిన్స్, వారి సంతానాన్ని శోధించడం ప్రారంభించారు.

అందులో భాగంగానే ఎలిజబెత్ బర్‌కు ఫోన్ చేశారు. బర్ తొలుత అది మోసగాళ్ల ఫోన్ కాదని రకరకాలుగా నిర్ధారించుకుని, తన డబ్బుకు ప్రమాదమేమీ లేదని నమ్మిన తరువాతే జెట్లాండ్‌తో మాట్లాడారు.

అలా మాట్లాడుతూ ఆమె అన్నా జార్విస్ కానీ, ఆమె తోబుట్టువులు కానీ కాలక్రమంలో మదర్స్ డే జరుపుకొనేవారు కాదని చెప్పారు.

తాను ఏ స్ఫూర్తితో మదర్స్‌డే నిర్వహించతలపెట్టానో అది కాస్తా పక్కదారి పట్టి పూర్తిగా వాణిజ్యమయం కావడంతో జార్విస్ మదర్స్ డేను జరుపుకోవడం మానేశారని చెప్పారు.

అన్నా జార్విస్ తల్లి అన్ రీవ్స్ జార్విస్

తల్లి నుంచి వచ్చిన ఆలోచన

అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఆలోచన జార్విస్‌కు తన తల్లి నుంచే వచ్చింది. జార్విస్ తల్లి ఇతర తల్లులను చైతన్యపరుస్తూ వారు తమ పిల్లల భవిష్యత్ గురించి జాగ్రత్తలు తీసుకునేలా చేసేవారని చరిత్రకారిణి, వెస్ట్ వర్జీనియా వెస్లియాన్ కాలేజీ ప్రొఫెసర్ క్యాథరీన్ ఆంటోలినీ చెప్పారు.

అమ్మలు చేసేపనికి గుర్తింపు ఉండాలని ఆమె భావించేవారు. 1858లో ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్ ప్రారంభించినప్పటి నుంచి మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవారు.

మదర్స్ డే వర్క్ క్లబ్బులు శిశుమరణాల రేటు తగ్గించడానికి పనిచేసేవి.

అప్పటికి పశ్చిమ వర్జీనియాలోని గ్రాఫ్టన్ ప్రాంతంలో శిశుమరణాలు అధికంగా ఉండేవి. ప్లేగు, ఇతర అంటువ్యాధుల కారణంగా పిల్లలు చనిపోతుండేవారు. ఆమెకు కూడా 13 మంది సంతానమైనప్పటికీ అందులో 9 మంది శిశుప్రాయంలోనే చనిపోయారు.

అమ్మ ఆశయాన్ని కొనసాగిస్తానని మాటిచ్చి..

1905లో ఆమె మరణించినప్పుడు ఆమె చుట్టూ ఉన్న మిగిలిన నలుగురు పిల్లల్లో అన్నా జార్విస్ అత్యంత బాధతో తన తల్లి స్ఫూర్తి కొనసాగిస్తానని మాటిచ్చారని ఆంటోలిని చెప్పారు.

అయితే.. అన్నా జార్విస్ తల్లి ఇతరుల జీవితాలు మెరుగుపడేలా అమ్మలు చేసే పనికి గుర్తింపు దక్కాలని, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకోగా అన్నా జార్విస్ మాత్రం 'అత్యుత్తమ మాతృమూర్తి ఎవరైనా ఆమె మీకు తల్లే’ అనే భావనతో ఈ మదర్స్ డేను జరపడం ప్రారంభించారు.

అందుకే ఇది Mothers Day అని బహువచనంతో కాకుండా Mother's Day అని ఏకవచనంతోనే ఉంటుంది.

'తన జీవితాన్ని మీ కోసం అంకితం చేసిన మీ తల్లిని గౌరవించే రోజు ఇది’ అనేది అన్నా జార్విస్ అభిప్రాయం.

1951వ సంవత్సరం అధికారిక మదర్స్ డే పోస్టర్‌తో అమెరికన్ పెయింటర్ నోర్మాన్ రాక్‌వెల్ (1894-1978)

మే రెండో వారం

1905లో అన్నా జార్విస్ తల్లి మరణించిన తరువాత మూడేళ్లకు అంటే 1908లో తొలిసారి గ్రాఫ్టన్ మెథడిస్ట్ చర్చిలో మే రెండో ఆదివారాన మదర్స్ డే నిర్వహించారు.

అన్నా జార్విస్ రెండో ఆదివారాన్ని ఎంచుకోవడానికి కారణం ఆమె తల్లి మరణించిన మే 9వ తేదీకి రెండో ఆదివారం సమీపంలో ఉండడమే కారణం.

ఆ తరువాత మదర్స్ డే ప్రాచుర్యం విపరీతంగా పెరిగింది. 1910లో వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో మదర్స్ డేకు సెలవు ఇచ్చారు.

1914కి వచ్చేసరికి ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఆ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్.

''అన్నా జార్విస్ ఈ వేడుకలను ఎన్నడూ వాణిజ్యంగా కోరుకోనప్పటికీ కొద్దికాలంలోనే ఇవి పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయి. పూల బొకేలు, గ్రీటింగు కార్డులు, బహుమతులు, చాక్లెట్ల రంగాలు ఈ మదర్స్ డేను వాణిజ్యంగా మార్చేశాయి’’ అన్నారు అంటోలినీ.

కానీ, అన్నా జార్విస్ కోరుకున్నది ఇది కాదు. వేడుకలు పూర్తిగా వాణిజ్య రూపం దాల్చినప్పుడు ఆమె ఒక పత్రికాప్ర కటన విడుదల చేసి మదర్స్ డేను వ్యాపారంగా మార్చొద్దని అర్థించారు.

వాణిజ్యానికి వ్యతిరేకంగా పోరాటం

1920 నాటికి మదర్స్ డే రోజు పువ్వులు కొనడం, బొకేలు కొనడం మానుకోవాలంటూ ఆమె ప్రజలను కూడా అర్థించారు. తాను కోరుకున్న స్ఫూర్తిని మరచి వివిధ సంస్థలు కూడా దీన్ని పూర్తిగా మార్చేయడంపై ఆమె బాధపడేవారని ఆంటోలినీ చెప్పారు.

దీంతో పూల వ్యాపారులు ఆమెను డబ్బుతో కొనాలనుకున్నారు.. కానీ, అందుకు ఆమె ఏమాత్రం అంగీకరించలేదు. ఈ మదర్స్ డేను అడ్డంపెట్టుకుని లాభపడే మార్గం ఉన్నా కూడా ఆమె ఎన్నడూ అలాంటి పని చేయలేదని.. అంధురాలైన తన సోదరి లిలియాన్‌తో కలిసి ఆమె తన తండ్రి, సోదరుడి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిపై ఆధారపడి సాదాసీదా జీవితం గడిపారని ఆంటోలినీ చెప్పారు.

పైగా మదర్స్ డే వాణిజ్యంగా మారిపోకుండా పోరాడేందుకు అన్నా జార్విస్ సొంత డబ్బు ఖర్చు చేశారని ఆంటోలిని చెప్పారు.

అన్నా జార్విస్ (1864-1948) (Photo by © CORBIS/Corbis via Getty Images)

1948లో మరణం

మదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించడానికి ముందు ఆమె 'మే రెండో ఆదివారం, మదర్స్ డే’ అనేదానికి కాపీరైట్ తీసుకున్నారు. మదర్స్ డేను వాణిజ్యపరంగా నిర్వహించేవారిపై ఆమె కేసులు వేసేవారు.

దీంతో కొన్ని సంస్థలు ఈ వేడుకలను జరిపేటప్పుడు మదర్స్ డేను బహువచనం(Mothers Day)గా వాడుతూ కాపీరైట్ నుంచి తప్పించుకునేవారు.

1944లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం అప్పటికి ఆమె వేసిన 33 కాపీరైట్ కేసులు పెండింగులో ఉన్నాయి.

అప్పటికి ఆమె వయసు 80 ఏళ్లు.. కళ్లు, చెవులు సరిగా పనిచేసేవి కావు. ఫిలడెల్ఫియాలోని ఒక శానిటోరియంలో ఆమె ఉండేవారు.

ఆమె సంరక్షణ కోసం కొందరు పూల, గ్రీటింగ్ కార్డు వ్యాపారులు ఆమెకు తెలియకుండా శానిటోరియానికి డబ్బు చెల్లించేవారన్న ప్రచారం ఉంది.

కానీ, జార్విస్ మాత్రం ఆ వయసులో కళ్లు కనిపించకపోయినా ఇళ్లిళ్లూ తిరుగుతూ మదర్స్ డే వేడుకలు వద్దంటూ సంతకాలు సేకరించేవారు.

జార్విస్ సోదరి లిలియన్ వారు నివసిస్తున్న శానిటోరియంలో గదిని వెచ్చబరిచే ప్రయత్నంలో కార్బన్ మోనాక్సైడ్ వ్యాపించి ఊపిరాడక చనిపోయారు.

జార్విస్ కూడా 1948లో గుండెపోటుతో మరణించారు.

ఎలిజిబెత్ బర్, ఆమె కుమార్తె మాడిసన్

'ఈ నిరాడంబర మదర్స్ డే చూస్తే ఆమె సంతోషించేవారు’

అన్నా జార్విస్ మరో సమీప బంధువు జేన్ ఉన్కెఫెర్(86) మాట్లాడుతూ.. మదర్స్ డే వ్యాపారంగా మారకుండా అన్నా చాలా పోరాడారని.. ఆమె సంపన్నురాలు కానప్పటికీ ఉన్న డబ్బంతా ఈ పోరాటానికే ఖర్చు చేశారని చెప్పారు.

అన్నా చివరి కాలంలో ఆమెను కుటుంబీకులు, సమీప బంధువులు చూసుకోలేనప్పటికీ మరో రకంగా ఆమెను గౌరవించుకున్నారు.

అన్నా జార్విస్ కుటుంబీకుల్లో తరువాత తరాలు మదర్స్ డే జరుపుకోకుండా ఆమె పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నాయి.

'మేం నిజంగానే మదర్స్ డేను ఇష్టపడం’ అన్నారు జేన్ ఉన్కెఫెర్.

'ఒక మంచి సెంటిమెంటుగా దీన్ని భావిస్తాం కానీ పూల బొకేలతో హడావుడి చేయడం, ఆడంబరంగా విందులకు వెళ్లడం చేయం’ అన్నారామె.

జేన్, ఆమె కజిన్స్ కూడా చిన్నప్పుడు తమ తల్లులు తమకు 'ప్రతి రోజూ మదర్స్ డే’యే అని చెప్పేవారన్నారు. కాగా.. మదర్స్ డే రోజు ఆడంబరాలు వద్దని అన్నా అనుకున్న ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఆడంబరాలు లేకుండా మదర్స్ డే జరుగుతోంది.

ఇప్పుడు కనుక అన్నా జార్విస్ ఉంటే ఇలా షాపింగ్, హడావుడి లేకుండా మదర్స్ డే జరుగుతున్నందుకు ఇదే అసలైన మదర్స్ డేగా సంతోషించేవారని ఆంటోలినీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Mother's Day: She started Mother's Day .. She was the first to demand that it be canceled
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X