ఫోర్బ్స్ జాబితా: మోడీ, సత్య నాదెళ్ల ఇన్, సోనియా ఔట్
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు.
ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా రాక్ స్టార్‌గా ఫోర్బ్స్ అభివర్ణించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులుగా పేర్కొంటూ 72 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 36వ స్థానంలో, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ 57 వ స్థానంలో నిలిచారు.
ఇక, ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన తెలుగు తేజం సత్య నాదెళ్ల ఈ జాబితాలో 64వ స్థానాన్ని దక్కించుకున్నారు. మూడో ర్యాంకులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, నాలుగో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, అయిదో స్థానంలో జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మోర్కెల్ ఉన్నారు.

మోడీ గురించి చెబుతూ.. భారత సరికొత్త రాక్ స్టార్ బాలీవుడ్ నుండి రాలేదని, అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్న మోడీయే సరికొత్త రాక్ స్టార్ అని అభివర్ణించింది. దశాబ్దాల గాంధీ కుటుంబ పాలన అనంతరం భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో అధికారంలోకి తెచ్చారని పేర్కొంది.
అయనను హిందూ జాతీయవాదిగా అబివర్ణించింది. 2002 నాటి గుజరాత్ అల్లర్లను ఈ సందర్భంగా ప్రస్తావించింది. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భారీ పథకాలను ప్రారంభించిన వ్యక్తి అంటూ ప్రశంసించింది. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాల్లో మోడీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఎల్ సీసీలు కొత్తగా చేరారు. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఈసారి ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో సోనియా గాంధీ పేరు లేకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications