నేపాల్ కొత్త ప్రధానిగా సుశీలా కర్కీ ? దేశ తొలి మహిళా సీజే, భారతీయ విద్యార్ది..!
అవినీతి, బంధుప్రీతి కారణంగా తలెత్తిన సంక్షోభంతో నేపాల్లో హింస చోటు చేసుకోవడం, ప్రభుత్వం కుప్పకూలడం వంటి పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హింసాత్మక నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలీ పదవి వదులుకుని పారిపోయారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రధానిగా ఓ మహిళను ఎంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ తొలి మహిళా ఛీఫ్ జస్టిస్, భారత్ లోని బనారస్ హిందూ వర్సిటీ పాత విద్యార్ది కూడా అయిన సుశీలా కర్కీకి ఈ పదవి దక్కనుంది.
నేపాల్ లో జెన్ జీ నిరసనల నేపథ్యంలో దేశ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి వెళ్లిపోయినా, సోషల్ మీడియా యాప్స్ పై నిషేధం ఎత్తేసినా నిరసనకారులు మాత్రం శాంతించడం లేదు. ఈ నేపథ్యంలో వారు కోరుకున్న విధంగా న్యాయవాది, రచయిత్రి, దేశ తొలి మహిళా ఛీఫ్ జస్టిస్, భారత్ లోని బనారస్ హిందూ యూనివర్శిటీ విద్యార్ధి కూడా అయిన సుశీలా కర్కీని ప్రధానిగా ఎంపిక చేసేందుకు రంగం సిద్దమవుతోంది.

2016లో సుశీలా కర్కీ నేపాల్ కు తొలి మహిళా ఛీఫ్ జస్టిస్ గా ఎంపికయ్యారు. అవినీతి కేసుల్లో నిక్కచ్చిగా ఉంటారని పేరున్న ఆ్మె అప్పట్లో ఒక మంత్రిని జైలులో పెట్టడంతో పాటు పలు కీలక తీర్పులు ఇచ్చారు. నిజాయితీపరురాలిగా, స్వతంత్ర వ్యవహారశైలి కలిగిన ఛీఫ్ జస్టిస్ గా కర్కీకి పేరుంది. ఛీఫ్ జస్టిస్ కాకముందు ఆమె.. 1979లో నేపాల్ లోని బిరత్‌నగర్‌లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పీఠాన్ని అధిష్టించారు. ఇప్పుడు అవినీతిపై రగిలిపోతున్న జెన్ జీ నిరసనకారులకు ఆమె ఆశాదీపంలా కనిపిస్తున్నారు.

తన పదవీకాలంలో కార్కి సంస్కరణవాదిగా కర్కీ పేరు తెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలపై మంత్రి జయ ప్రకాష్ గుప్తాను దోషిగా నిర్ధారించి జైలుకు పంపిన చరిత్ర ఆమెది. అవినీతి నుండి వివాదాస్పద నిజ్‌గఢ్ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్ట్ వరకు పలు సున్నితమైన కేసుల్లో ఆమె తీర్పులిచ్చారు. అలాగే నేపాలీ మహిళలు తమ పిల్లలకు పౌరసత్వం ఇవ్వడానికి అనుమతించడం వంటి తీర్పులు కూడా ఇచ్చారు. 2017లో ప్రభుత్వం నేపాల్ పార్లమెంట్ లో ఆమెపై అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టింది.












Click it and Unblock the Notifications