At-risk: నెగెటివ్ రిపోర్ట్ వచ్చినా.. 14 రోజుల క్వారంటైన్: కేంద్రం కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు చెందిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. క్రమంగా విస్తరిస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని దాటేసింది. ఇప్పటిదాకా 20 దేశాల్లో అడుగు పెట్టింది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఆయా దేశాలన్నింట్లోనూ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త మహమ్మారి ఎంట్రీ ఇచ్చిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఒమిక్రాన్ విస్తరించిన దేశాలివే..
దక్షిణాఫ్రికా, బోట్సువానాల్లో వెలుగులోకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే ఒమిక్రాన్ వేరియంట్ ఇతర ఖండాలకు విస్తరించింది. ఆస్ట్రేలియా-6, ఆస్ట్రియా-1, బ్రెజిల్-1, బెల్జియం-1, బోట్సువానా-19, కెనడా-3, చెక్ రిపబ్లిక్-1, డెన్మార్క్-2, ఫ్రాన్స్-1, జర్మనీ-4, హాంకాంగ్-3, ఇజ్రాయెల్-2, ఇటలీ-4, జపాన్-1, నెదర్లాండ్స్-14, పోర్చుగల్-13, దక్షిణాఫ్రికా-77, స్వీడన్-1, యునైటెడ్ కింగ్‌డమ్-14 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కేసుల సంఖ్య పెరిగే ఛాన్స్..
ఆయా దేశాల్లో ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన వారి ద్వారా ఎంతమందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకి ఉంటుందనే విషయం ఆందోళనకు గురి చేస్తోంది. వారి కాంటాక్టులను గుర్తించడంతో పాటు.. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేశాయి. భారత్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చి, కరోనా వైరస్ బారిన పడ్డ వారు చాలామంది ఉన్నారు. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు. ఆ నివేదికలు అందాల్సి ఉంది.

ఒమిక్రాన్ కట్టడికి..
ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకుంటోంది. 12 దేశాలను ఎట్ రిస్క్‌గా గుర్తించింది. ఆయా దేశాల నుంచి ఇంటికొచ్చే వారిపై ఆంక్షలను విధించింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన విదేశీయులకూ ఈ నిబంధనలను వర్తింపజేసింది. ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను విమానాశ్రయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి.

నెగెటివ్ రిపోర్ట్ ఉన్నా..
విమానాశ్రయాల్లో కోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నెగెటివ్‌గా తేలిన తరువాత కూడా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని ఆదేశించింది. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన ప్రయాణికుల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తారు. స్టాండర్డ్ ప్రొటోకాల్స్ ప్రకారం.. వారు క్వారంటైన్‌కు వెళ్లాలి. 14 రోజుల ట్రావెల్ హిస్టరీని తప్పనిసరిగా విమానాశ్రయం అధికారులకు అందజేయాలి. చివరి 14 రోజుల్లో ఏ దేశంలో పర్యటించారనే విషయాన్ని వివరించాల్సి ఉంటుంది.

ఎయిర్ సువిధ పోర్టల్‌లో..
నెగెటివ్ ఆర్టీ-పీసీఆర్ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకు సదరు ప్రయాణికులు బయటికి వెళ్లే వీలు లేదు. ఎయిర్ పోర్ట్ పాయింట్‌లోనే నిరీక్షించాలి. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత కూడా 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్‌గా తేలిన వారు ఐసొలేషన్‌లో గడపాలి. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తారు.
Recommended Video

ఎట్ రిస్క్ దేశాలివే..
ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 12 దేశాలను కేంద్ర ప్రభుత్వం ఎట్ రిస్క్‌గా గుర్తించింది. యునైటెడ్ కింగ్‌డమ్, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్సువానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాలను ఈ జాబితాలో చేర్చింది. ఆ దేశాల నుంచి ఎవరు వచ్చినా.. ఈ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications