వేడుకల వేళ షాక్: రాజధానిని కమ్మేసిన చీకట్లు!
ప్రపంచమంతా కొత్త ఏడాది వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐర్స్‌లో భారీ విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రాజధాని నగరాన్ని చీకట్లు కమ్మేశాయి. ఈ ఘటన వల్ల సుమారు 30 వేల మందికి పైగా ప్రజలు అంధకారంలోని గడపాల్సి వచ్చింది.
అసలెందుకీ అంధకారం?
అధికారుల సమాచారం ప్రకారం.. రాజధాని సమీపంలోని ఓ ప్రధాన పవర్ ప్లాంట్‌లో జరిగిన సాంకేతిక ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీనికి తోడు సెలవుల సీజన్ కావడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరగడం కూడా ఈ గ్రిడ్ వైఫల్యానికి ఓ కారణమని నిపుణులు భావిస్తున్నారు.

అర్జెంటీనాలో ఇలా అంధకారంలో మునిగిపోవడం ఇది మూడోసారి. 2019 తర్వాత జరిగిన అతిపెద్ద విద్యుత్ అంతరాయం ఇదే కావడం గమనార్హం. జూన్ 2019లో అర్జెంటీనాలో అత్యంత భయంకరమైన బ్లాకౌట్ సంభవించింది. అప్పట్లో సుమారు 5 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అర్జెంటీనాతో గ్రిడ్ అనుసంధానం ఉన్న కారణంగా ఉరుగ్వే, పరాగ్వే వంటి పొరుగు దేశాలు కూడా అప్పట్లో చీకట్లో మగ్గిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి, ఆసుపత్రులు జనరేటర్ల సాయంతో నడపాల్సి వచ్చింది.
ప్రస్తుత పరిస్థితి ఇలా..
తాజాగా ఏర్పడిన విద్యుత్ సంక్షోభం వల్ల 30 వేల మంది ప్రభావితమైనప్పటికీ.. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. కొత్త ఏడాది వేడుకల సమయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఇలాంటి సంఘటనలు చూస్తే, 2009లో బ్రెజిల్‌లో జరిగిన భారీ విద్యుత్ కోత వల్ల సుమారు 6 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు.కొత్త ఏడాది వేళ వెలుగులతో నిండిపోవాల్సిన నగరం, పవర్ ప్లాంట్ లోని సాంకేతిక లోపం వల్ల అంధకారంలోకి వెళ్లడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications