చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ.. ఇరాన్ సంచలనం
Israel Iran Ceasefire: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య 12 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది. ఇరు దేశాల మధ్య సంపూర్ణ, సమగ్ర కాల్పుల విరమణకు తాము షరతులు విధించినట్లు వెల్లడించింది. దీన్ని ట్రంప్ ప్రస్తావించలేదు.
డొనాల్డ్ ట్రంప్ చేసిన సీజ్ ఫైర్ ఒప్పందం ప్రకారం- ఇరాన్ 12 గంటల తరువాత కాల్పుల విరమణను చేపడుతుంది. ఇజ్రాయెల్ 24 గంటల తరువాత కాల్పుల విరమణను అమలు చేస్తుంది. మొత్తంగా 24 గంటల వ్యవధిలో- ఈ యుద్ధానికి అధికారికంగా తెరపడినట్టవుతుందని ట్రంప్ చెప్పారు.

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇరాన్ స్పందించింది. ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణకు సంబంధించి ఎటువంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పష్టం చేశారు. కొద్దిసేపటికి కిందటే తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
ఇరాన్ పదేపదే స్పష్టం చేసినట్లుగా.. తమపై ఇజ్రాయెల్ తొలుత యుద్ధం ఆరంభించిందని, ఆ దేశమే ఇప్పుడు కూడా కాల్పుల విరమణ దిశగా తొలి అడుగు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇజ్రాయెల్ ముందుగా తన వైమానిక దాడులను నిలిపివేయాలని షరతు పెట్టారు.
ప్రస్తుతానికి, ఎటువంటి కాల్పుల విరమణ లేదా సైనిక కార్యకలాపాల నిలిపివేతపై ఒప్పందం ఏదీ కుదరలేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ అడ్మినిస్ట్రేషన్.. తమ దేశ కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటలలోపు తమ దేశంపై దాడులు, దురాక్రమణ, సైనిక చర్యను నిలిపివేస్తే.. ఆ తర్వాత తమ ప్రతిదాడులు చేయబోమని అబ్బాస్ అరఘ్చి తెలిపారు.
తాము సైనిక చర్యను నిలిపివేయాలా? వద్దా అనే తుది నిర్ణయం ఇజ్రాయెల్ పై ఆధారపడి ఉందని తేల్చి చెప్పారు. తాము పెట్టిన డెడ్ లైన్ తర్వాత కూడా ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగించినట్లు అరఘ్చి చెప్పారు. ఇజ్రాయెల్ దురాక్రమణను తిప్పి కొట్టేలా ఇరాన్ సైనిక చర్య కొనసాగుతోందని అన్నారు.
తమ దేశాన్ని చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకూ సంరక్షించడానికి సాయుధ దళాలు సంసిద్ధంగా ఉన్నాయని, చివరి నిమిషం వరకు శత్రువు ఎలాంటి దాడి చేసినా సరే.. దాన్ని తిప్పి కొడతామని, ఇందులో రాజీపడే ప్రసక్తే లేదని అరాగ్చీ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తన దాడులను నిలిపివేయకపోతే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయనీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications