అమెరికా మరింత రెచ్చగొట్టింది.. ఇక ఆపేది లేదు: తాజా ఆంక్షలపై కిమ్ జాంగ్ ఉన్ ఫైర్!
ఉత్తరకొరియాను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం, తాజాగా మరిన్ని ఆంక్షల విధించిన నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్యాంగ్‌యాంగ్: ఉత్తరకొరియాను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం, తాజాగా మరిన్ని ఆంక్షల విధించిన నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా నిరంకుశత్వానికి ఇది ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య గత పది నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే ఇరు దేశాధినేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను 'బుద్ధిలేని అధ్యక్షుడు'గా అభివర్ణించారు.

అమెరికా రెచ్చగొట్టింది...
తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో ఉత్తర కొరియాను చేర్చినట్లు రెండు రోజుల కిందట శ్వేతసౌధంలో జరిగిన అధికారిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను ఉగ్రవాద ప్రేరేపిత జాబితాలో చేర్చడం ద్వారా అమెరికా మరింత రెచ్చగొట్టిందని ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మండిపడింది.

తీవ్ర ఆగ్రహంలో కిమ్...
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితాలో ఉత్తరకొరియాను చేర్చడంపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తరకొరియా పేర్కొంది. అమెరికా నిరంకుశ పాలనకు ఇది ఉదాహరణ అని వ్యాఖ్యానించింది. కావాలనుకున్నప్పుడు ఉగ్రవాద దేశంగా ముద్ర వేయడం, వద్దనుకున్నప్పుడు జాబితాలోంచి దేశం పేరు తొలగించడం అమెరికాకు సర్వసాధారణమేనని ఎద్దేవా చేసింది.

అమెరికా పెద్ద తప్పు చేసింది...
తమను ఉగ్రవాద దేశంగా పేర్కొని అమెరికా పెద్ద తప్పుచేసిందని, ఇకపై అణ్వాయుధాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఉత్తరకొరియా అధినేత కిమ్ వ్యాఖ్యానించినట్లు ఆ దేశ అధికార పత్రిక రోడాంగ్ సిన్మన్ ఓ కథనంలో పేర్కొంది. గాలివాటం ప్రకటనలతో తమను నిరోధించలేరని, భవిష్యత్ పరిణామాలకు అమెరికాయే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కూడా అమెరికాను ఘటుగా హెచ్చరించింది.

బుద్ధిలేని అమెరికా అధ్యక్షుడు...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ‘బుద్ధిలేని అధ్యక్షుడు'గా ఉత్తరకొరియా అభివర్ణించింది. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ కొరియా సార్వభౌమాధికారాన్ని కించపరిచి డొనాల్డ్ ట్రంప్ పెద్ద నేరానికి పాల్పడ్డాడని ఆక్షేపించింది. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతోంది. గతంలోనూ ఉత్తర కొరియాను ఉగ్రవాద దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. అయితే 2008లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఈ జాబితా నుంచి ఉత్తర కొరియాను తొలగించారు.












Click it and Unblock the Notifications