చరిత్రలోనే అన్ని వైరస్ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి; కరోనా దారుణ స్థితికి: బిల్ గేట్స్ ఆందోళన
కరోనావైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేరియంట్ మహమ్మారి యొక్క దారుణమైన దశను తెలియజేస్తుందని బిలియనీర్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం ట్విట్టర్ లో హెచ్చరించారు. చరిత్రలో ఏ వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందలేదని, కానీ ఒమిక్రాన్ వేరియంట్ అన్ని వైరస్ల కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బూస్టర్ డోసులను తీసుకోవాలని, ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బిల్ గేట్స్ ప్రజలను కోరారు.
Recommended Video
అంతా నార్మల్ అవుతుంది అనగానే మళ్ళీ ఒమిక్రాన్ తో దారుణ స్థితి
జీవితం సాధారణ స్థితికి వస్తుందని అంతా భావించిన సమయంలో మళ్లీ మనం మహమ్మారి యొక్క దారుణ స్థితిలో ప్రవేశిస్తున్నామంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రతి ఒక్కరి ఇంటికి చేరుకుంటుందని ఆయన అన్నారు. తన సన్నిహిత మిత్రులు చాలామంది ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారని ఆయన అన్నారు. తాను తన సెలవు ప్రణాళికలను చాలా వరకు రద్దు చేసుకున్నానని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. కొత్త వేరియంట్ త్వరలో ప్రపంచంలోని ప్రతి దేశంలో తన ఉనికిని చాటే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ఒమిక్రాన్ వ్యాప్తి అధికం .. కచ్చితంగా దారుణ పరిస్థితులు చూస్తాం
కానీ ఒమిక్రాన్ మిమ్మల్ని ఎంత అనారోగ్యానికి గురిచేస్తుంది అనే దానిపై తక్కువ డేటా ఉందని, ఈ సమయంలో మనం దాని గురించి మరింత తెలుసుకునే వరకు దానిని తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం అని బిల్ గేట్స్ గట్టిగా పేర్కొన్నారు. ప్రతిఒక్కరు కరోనా నిబంధలను పాటించాలని సూచించారు.ఇది డెల్టా కంటే సగం మాత్రమే తీవ్రంగా ఉన్నప్పటికీ, ఇది చాలా వ్యాప్తి చెందే వేరియంట్ కావడంతో దీనివల్ల దారుణమైన పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. కచ్చితంగా మనం దారుణమైన పరిస్థితి చూస్తామని ఆయన పేర్కొన్నారు.

మహమ్మారి 2022 చివరి వరకు అంతమయ్యే అవకాశం ఉందని భిల్ గేట్స్ ఆశాభావం
ఇప్పటికే టీకాలు వేసిన వ్యక్తులలో పురోగతి కేసుల పెరుగుదలను తాము చూస్తున్నామని వెల్లడించారు. టీకాలు ప్రజలు తీవ్రంగా అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా లేదా చనిపోకుండా నిరోధించడానికి రూపొందించబడ్డాయని, అవి బాగా పని చేస్తున్నాయి అని బిల్ గేట్స్ వెల్లడించారు. కానీ కరోనా సోకకుండా టీకాలు ఆపలేవని తెలిపారు. కరోనా కట్టడికి తీసుకునే చర్యలు వాక్సినేషన్ విధానం ద్వారా మహమ్మారి 2022 చివరి వరకు అంతమయ్యే అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు.

భారత్ లోనూ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ... అలెర్ట్ అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
మనం తీసుకునే సరైన చర్యలు మీదనే మహమ్మారి ముగింపు ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏదో ఒక రోజు మహమ్మారి ముగుస్తుంది . మనం ఒకరినొకరు సంతోషంగా చూసుకునే రోజు అతి త్వరలోనే వస్తుంది అంటూ బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 213కి పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలలో కఠిన ఆంక్షలకు తెరతీశాయి. ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని, మాస్కులను ధరించాలని స్పష్టం చేస్తున్నాయి. సమూహాలుగా ప్రజలు తిరగకూడదని హెచ్చరిస్తున్నాయి. రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల విషయంలో ఆంక్షలు విధించేందుకు సిద్దం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications