మళ్లీ మొదలుపెట్టేసిన పాకిస్తాన్..! ఆపరేషన్ సింధూర్ వృథాయేనా ?
ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను, లాంచింగ్ ప్యాడ్‌లను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటున్నట్లు తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి.
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో తొలుత పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలను నేలకూల్చింది. ఇందులో నియంత్రణ రేఖ పొడవునా ఉన్న శిబిరాలు కూడా ఉన్నాయి. దీంతో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పినట్లయింది. అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధం సాగడం, మధ్యలోనే పాక్ విజ్ఞప్తితో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడం జరిగిపోయాయి.
అయితే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం సాధించిన విజయాలు పాకిస్తాన్ కు పీడకలగా మారిపోయాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానితో పాటు పలువురు నేతలు పలు సందర్భాల్లో అంగీకరించారు. అయితే కుక్కతోక వంకర అన్నట్లుగా పాకిస్తాన్ తిరిగి ఉగ్ర శిబిరాలను నిర్మించడం ప్రారంభించేసింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి చిన్న చిన్న శిబిరాలను నిర్మించడం ప్రారంభించింది.

ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను, లాంచింగ్ ప్యాడ్‌లను పాకిస్తాన్ తిరిగి నిర్మించుకుంటున్నట్లు తాజాగా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే 7న భారత బలగాలు పాకిస్తాన్ తో పాటు పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించాయి. ఇందులో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇందులోనే జైషే మహమ్మద్ కార్యకలాపాల కేంద్రంగా భావించే బహావల్‌పూర్‌లోని దాని ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసమైంది.
ఇప్పుడు నిఘా సంస్థలు చెబుతున్న దాని ప్రకారం ఐఏఐ సహకారంతో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవులలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి. నిఘా , వైమానిక దాడులను తప్పించుకోవడమే ఈ వ్యూహం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. ప్రస్తుతం పునర్నిర్మిస్తున్న శిబిరాలు లూని, పుత్వాల్, టైపు పోస్ట్, జమిలా పోస్ట్, చప్రార్, ఫార్వర్డ్ కహుతా, చోటా చాక్, జాంగ్లోరా వంటి ప్రాంతాలలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ శిబిరాలలో థర్మల్ ఇమేజర్‌లు, ఆకులను ఛేదించే రాడార్, ఉపగ్రహ నిఘాను ఎదుర్కోవడానికి రూపొందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

అలాగే పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి పీఓకేలోనని కెల్, షార్ది, దుద్నియల్, అత్ముఖం, జురా, లీపా వ్యాలీ, పచ్చిబన్ చమన్, తండపాని, నయ్యాలి, జంకోట్, చకోటి, నికైల్, ఫార్వర్డ్ కహుతా వంటి ప్రాంతాలతో సహా 13 లాంచింగ్ ప్యాడ్‌లను తిరిగి నిర్మించుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని ఇండియా టుడే నివేదించింది. వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూల్చివేసిన అంతర్జాతీయ సరిహద్దులోని నాలుగు ఉగ్రవాద లాంచింగ్ ప్యాడ్‌లను కూడా తిరిగి యాక్టివేట్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications