Masood Azhar: పక్కలో బల్లెం: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కోసం వేట మొదలు: ఏకంగా తాలిబన్లకే..!!
ఇస్లామాబాద్: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజర్. జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహూతి దాడికి పాల్పడిన ఘటనకు మాస్టర్ మైండ్ అతనే. భారత్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మౌలానా మసూద్ అజర్ కోసం వేట మొదలైంది. అతన్ని బంధించడానికి వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నాయి.
మౌలానా మసూద్ అజర్‌కు ప్రస్తుతం పాకిస్తాన్‌లో నివసిస్తోన్నట్లు అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం కొత్త అనుమానాలను లేవనెత్తింది. మసూద్ అజర్ ఆఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకుంటోందని ధృవీకరించింది. అతణ్ని అరెస్ట్ చేయాలంటూ తాలిబన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారికంగా లేఖ రాసింది. అతను ఎక్కడున్నాడనే విషయాన్ని వెంటనే గుర్తించాలని, అరెస్ట్ చేసి, తమకు అప్పగించాలని సూచించింది.

మసూద్ అజర్.. ఆఫ్ఘనిస్తాన్‌లోనే తలదాచుకున్నాడని, దీనిపై తమకు పక్కా సమాచారం ఉందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. జైషె మహ్మద్‌ను తాము నిషేధించామని, ఆ సంస్థ కార్యకలాపాలేవీ తమ దేశంలో కొనసాగట్లేదని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది. నన్ఘర్హర్ లేదా, కునర్ ప్రావిన్స్‌లల్లో మౌలానా మసూద్ అజర్ తలదాచుకుని ఉంటాడని తాము బలంగా నమ్ముతున్నట్లు ఆ శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
జైషె మహ్మద్ చీఫ్ తమదేశంలో తలదాచుకుంటోన్నాడనే విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ధారించలేదు. అంతకుముందు ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రస్తావించలేదు. 2002 జనవరి 14వ తేదీన అప్పటి పర్వేజ్ ముషార్రఫ్ ప్రభుత్వం జైషె మహ్మద్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ సంస్థతో సంబంధాలను కొనసాగిస్తోన్న బహవాల్‌పూర్ అల్-రహ్మత్ ట్రస్ట్, కరాచీలోని అల్-ఫుర్కాన్ ట్రస్ట్‌పైనా నిషేధం వేటు వేసింది పాకిస్తాన్.
మసూద్ అజర్ కోసం భారత్ ఇప్పటికే అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో గల వైమానికదళం ఎయిర్‌బేస్‌పై దాడులు చేసిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. మసూద్‌తో పాటు అతని సోదరుడు అబ్దుర్ రవూఫ్, మరో ఇద్దరిని ఈ జాబితాలో చేర్చింది. పుల్వామా దాడి తరువాత- పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని జైషె మహ్మద్ శిబిరాలపై దాడులు చేసింది.












Click it and Unblock the Notifications