పాకిస్తాన్ మరో సంచలనం- ఆర్మీ ఛీఫ్ కు టాప్ ప్రమోషన్- యుద్ధంపై నమ్మించేయత్నం !
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారీ నష్టాల్ని చవి చూసింది. ముఖ్యంగా ఉగ్రవాద శిబిరాలతో పాటు ఎయిర్ బేస్ లు, రక్షణ స్థావరాలపై భారత క్షిపణులు చేసిన దాడుల్ని పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోదు. అయితే ఈ ఆపరేషన్ జోరుగా సాగుతున్న సమయంలో అమెరికా జోక్యంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాకిస్తాన్ బతికిపోయింది. ఆమెరికా మాట విని ఈ ఆపరేషన్ ను భారత్ నిలిపేయడం ఇక్కడి ప్రజలకు సైతం నచ్చలేదు.
అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను తాము దీటుగా ఎదుర్కొని దేశ ప్రజల్ని రక్షించామని చెప్పుకుంటున్న పాకిస్తాన్ పాలకులు ఇవాళ ఇందుకు కారణమైన ఆర్మీ ఛీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కు ఏకంగా ప్రమోషన్ ఇచ్చారు. ప్రస్తుతం జనరల్ గా ఉన్న ఆసిమ్ మునీర్ ను సైన్యంలో అత్యున్నత పదవి అయిన ఫీల్డ్ మార్షల్ కు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర మంత్రివర్గం మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనను ఆమోదించిందని తెలిపింది. మునీర్ పదోన్నతిపై చర్చించడానికి కేంద్ర మంత్రివర్గం ఇవాళ సమావేశమైందని తెలిపింది. మరోవైపు భారతదేశంతో ఇటీవలి సైనిక వివాదంలో పాకిస్తాన్ సాయుధ దళాలను విజయవంతంగా" నడిపించినందుకు మునీర్‌కు ఈ పదోన్నతి లభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
భారత్ తో జరిగిన పోరులో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నా స్వదేశంలో మాత్రం తాము విజయం సాధించినట్లే చెప్పుకుంటోంది. అంతే కాదు భారత్ కు తీవ్ర నష్టం చేకూర్చినట్లు కూడా ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ, సైన్యం కూడా వేర్వేరు ప్రకటనల్లో పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని ఆధారాలతో సహా తిప్పికొట్టాయి. అయినా అక్కడి ప్రజల్ని నమ్మించి ఇలా ఆర్మీ ఛీఫ్ కు ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications