ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు..
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశంగా పాకిస్థాన్ నిలిచింది. 8వ ప్రపంచ గాలి నాణ్యత నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్, తజికిస్థాన్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక భారత్ ఈ లిస్టులో ఆరో స్థానంలో ఉంది. స్విస్ గాలి నాణ్యత సాంకేతిక సంస్థ ఐక్యూఎయిర్ (IQAir) ప్రచురించిన ఈ 2025 నివేదిక ప్రపంచ గాలి నాణ్యత స్థితిని వెల్లడించింది.
143 దేశాలు.. ప్రాంతాల్లోని 9,446 నగరాల్లో ఉన్న 40,000 పైగా పర్యవేక్షణ కేంద్రాల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ప్రభుత్వ, విద్యా, స్వచ్ఛంద, ప్రైవేటు సంస్థలతో పాటు పౌర శాస్త్రవేత్తలు ఈ డేటాను అందించారు. ఇక వాయు కాలుష్యంలో చైనా 20వ స్థానంలో నిలవగా, అమెరికా 120వ, యునైటెడ్ కింగ్ డమ్ 110వ స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన PM2.5 మార్గదర్శకాలను ప్రపంచంలో కేవలం 13 దేశాలు లేదా భూభాగాలు మాత్రమే చేరుకోగలిగాయి. ఆ 13 దేశాలు లేదా భూభాగాలు: ఫ్రెంచ్ పొలినీసియా, ప్యూర్టో రికో, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్, బార్బడోస్, న్యూ కాలెడోనియా, ఐస్ లాండ్, బెర్ముడా, రీయూనియన్, అండొరా, ఆస్ట్రేలియా, గ్రెనడా, పనామా, ఎస్టోనియా.
నివేదికలోని వివరాలు చూస్తే.. "143 దేశాలు లేదా భూభాగాలలో 130 (91 శాతం) WHO వార్షిక సగటు PM2.5 మార్గదర్శక విలువను అధిగమించాయి. అత్యంత కలుషితమైన ఐదు దేశాలు పాకిస్థాన్, బంగ్లాదేశ్, తజికిస్థాన్, చాద్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 25 నగరాలు అన్నీ భారత్, పాకిస్థాన్, చైనాలలో ఉన్నాయి. అత్యంత కలుషితమైన నాలుగు నగరాల్లో మూడు భారత్‌లోనే ఉన్నాయి.
ఇక నగరాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ అత్యంత కలుషితమైనది. చైనాలోని హోటన్, మేఘాలయలోని బైర్నిహాత్ తర్వాతి స్థానాల్లో నిలవగా, దిల్లీ నాలుగో స్థానంలో, పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ ఐదో స్థానంలో ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని న్యూవౌడ్‌విల్లే 1.0 µg/m³ PM2.5 సాంద్రతతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నమోదైంది.
"2025లో అటవీ కార్చిచ్చుల ప్రభావం గతంలో తక్కువ PM2.5 స్థాయిలను చూసిన ప్రాంతాలపై తీవ్రం అయింది. ఫలితంగా 2024లో 17 శాతం ఉన్న ప్రపంచ నగరాలు 2025లో కేవలం 14 శాతం మాత్రమే WHO వార్షిక PM2.5 మార్గదర్శకాన్ని చేరుకున్నాయి," అని నివేదిక వివరించింది. ఈ ధోరణి స్వచ్ఛమైన గాలి కోసం చురుకైన పర్యవేక్షణ, ప్రణాళిక అవసరమని" స్పష్టం చేసింది.

స్వచ్ఛమైన గాలిని నిర్వహించడం ఒకే లక్ష్యాన్ని చేరుకోవడం కాదని, నిరంతర అభివృద్ధికి దీర్ఘకాలిక నిబద్ధతతో కూడిన కృషి అవసరమని నివేదిక అభిప్రాయపడింది. "పిల్లలకు వాయు కాలుష్య ప్రభావం జీవితకాలం ఉంటుంది. శ్వాసకోశ నష్టం కోలుకోలేనిది. పిల్లలు తాము ఎంచుకోని గాలి నాణ్యత యొక్క శాశ్వత ఆరోగ్య ఖర్చులను భరించాల్సి ఉంటుంది" అని అది తీవ్రంగా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications