ట్రంప్ కు బిగ్ షాక్..! ఇజ్రాయెల్ పై తేల్చేసిన పాకిస్తాన్ ..!
ఇరాన్ పై యుద్దాన్ని అడ్డుపెట్టుకుని ఇజ్రాయెల్ కు ఇస్లామిక్-అరబ్ దేశాల గుర్తింపు సాధించి పెట్టాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ కు గుర్తింపునిచ్చేలా అబ్రహం ఒప్పందాలపై సంతకాలు పెట్టాలని ఆయా దేశాలపై ట్రంప్ తెచ్చిన ఒత్తిడి ఏమాత్రం ఫలించకపోగా.. ఎదురుతన్నేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ (Pakistan) ప్రయోజనాల్ని పణంగా పెట్టి అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయిద్దామనుకున్న ట్రంప్ ఎత్తులు పారలేదు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అబ్రహం ఒప్పందాలలో చేరాలని, ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్‌ను ఒక సంధి స్థానంలో నిలబెట్టారు. ఇరాన్‌తో కుదిరే అధికారిక శాంతి ఒప్పందాలకు దీన్ని ట్రంప్ ముడిపెట్టారు. దీంతో పాకిస్తాన్ క్లిష్టస్దితిలో చిక్కుకున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను ధిక్కరించి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమా లేక తన ప్రత్యర్థి అయిన ఇజ్రాయెల్‌ను గుర్తించడమా అనే సందిగ్ధంలో పడింది.

చివరికి పాకిస్తాన్ మొదటి మార్గాన్నే ఎంచుకుంది. తమ ప్రాథమిక సిద్ధాంతాలపై రాజీపడటం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తేల్చేశారు. పాకిస్తాన్ తన 78 ఏళ్ల చరిత్రలో ఇజ్రాయెల్‌ను ఎన్నడూ గుర్తించలేదని, దీనివల్ల ఆ దేశ పౌరులు పాకిస్తానీ పాస్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్‌కు వెళ్లలేకపోతున్నారని, ఇజ్రాయెల్ విషయంలో తాము దీర్ఘకాలంగా పాటిస్తున్న వైఖరి, అబ్రహం ఒప్పందాలలో చేరడానికి అనుమతించదని ఆసిఫ్ తేల్చిచెప్పేశారు. ఇజ్రాయెల్ పట్ల తమ వైఖరిలో మార్పు వస్తుందన్న ఏ సూచననైనా తిరస్కరించేందుకు పాకిస్తాన్ పాస్‌పోర్ట్ విధానమే నిదర్శనమని కూడా ఆయన స్పష్టం చేసారు. తమ పాస్‌పోర్ట్‌లపై ఇజ్రాయెల్ పేరు కూడా పొందుపరచని ఏకైక దేశం తమదే అన్నారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదనే విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు వెల్లడించారు.














Click it and Unblock the Notifications