ఎడారిని తలపిస్తున్న పాకిస్థాన్..? పంటలు ఎండిపోయి.. అన్నమో రామచంద్రా అంటూ..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఉక్కుపాదం మోపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ పై కఠినంగా వ్యవహరించింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందే సింధూ జలాల పంపిణీ రద్దు, ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఎగుమతులు, దిగుమతులు నిలిపివేత లాంటి చర్యలతో పాక్ కు ఆర్థికంగా తీరని నష్టం కలిగించింది. అయితే భారత్ తీసుకున్న నిర్ణయాల్లో పాకిస్థాన్ కు భారీగా దెబ్బకొట్టింది మాత్రం సింధూ జలాల పంపిణీ రద్దు.
ఇటీవల తమకు నీళ్లు విడుదల చేయాలంటూ సింధూ జలాల ఒప్పందంపై భారత్ కు పాకిస్థాన్ 4 లేఖలు రాసింది. భారత్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో కోరింది పాక్. సింధూ జలాల నిలిపివేతతో పాకిస్థాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటోందని పేర్కొంది. పాకిస్థాన్ కు నీళ్లు కట్ చేసి దాదాపు 2 నెలలు కావొస్తోంది. దీంతో ఆ దేశం తీవ్రంగా నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ మేరకు సింధూ నది జలాల పంపిణీ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పాక్ పట్టుబడుతోంది.
సింధు జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా సింధూ బేసిన్‌లో నీటి ప్రవాహం 15 శాతం తగ్గింది. ఇప్పటికే వేసవిలో పంటలు ఎండిపోయి పాక్ రైతులు రోడ్డున పడ్డారు. అయితే నీటి కటకట కారణంగా ఖరీఫ్ సీజన్‌లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఖరీఫ్‌కు ముందే భారత్ తీసుకున్న నిర్ణయంతో 21 శాతం నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు.

మరోవైపు రెండు రోజుల నుంచి పాకిస్థాన్ లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. తీవ్రమైన వేడి గాలుల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాకిస్థాన్ లోని పంజాబ్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వా, కాశ్మీర్, గిల్గిట్- బాల్టిస్తాన్.. తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి అక్కడి ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని అక్కడి యంత్రాంగం అంచనా వేస్తుంది.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణులతో దాడి చేసి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు రక్షణశాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications