ట్రంప్ కు పాక్ బిగ్ షాక్..! నోబెల్ ప్రైజ్ కు మద్దతిచ్చిన 24 గంటల్లోనే.. !
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ తో జరుగుతున్న యుద్దంలో తమ మిత్రదేశం ఇజ్రాయెల్ నష్టాలు చవిచూస్తుండటం అమెరికాలో ఆందోళన పెంచుతోంది. దీంతో రెండు వారాల్లో ఈ యుద్దంలో చేరాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన రెండు రోజుల్లోనే ట్రంప్ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చేశారు.
నిన్న రాత్రి ఇరాన్ లోని మూడు అణు ప్లాంట్లు ఫోర్డో, నతాంజ్, ఎస్పాహన్ పై దాడికి దిగిన అమెరికా భారీ బాంబుల్ని ప్రయోగించింది. ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలు ఈ దాడుల్ని తప్పుబట్టాయి. అలాగే మిగిలిన దేశాలు కూడా ఇరాన్-ఇజ్రాయెల్ వార్ లోకి అమెరికా దూరడం మంచిది కాదని వారిస్తున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ కూడా ఈ దాడుల్ని ఖండించింది.

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఐరాస చార్టర్ ప్రకారం ఇరాన్ తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కును కలిగి ఉందని అమెరికాకు గుర్తుచేసింది.
ఇరాన్‌పై కొనసాగుతున్న దురాక్రమణ కారణంగా చోటు చేసుకుంటున్న భారీ ఉద్రిక్తత, హింస తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఈ ప్రాంతం, అంతకు మించి తీవ్రంగా నష్టపరిచే ప్రభావాలు ఉంటాయని పేర్కొంది. అయితే భారత్ తో తమ యుద్ధాన్ని నివారించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటూ ప్రతిపాదించిన పాకిస్తాన్ 24 గంటల్లోనే ఇలా ఇరాన్ పై దాడుల్ని తప్పుబట్టడం విశేషం. పాక్ ఆర్మీ ఛీఫ్ ఆసిమ్ మునీర్ తో ట్రంప్ భేటీ తర్వాత పాకిస్తాన్ ఆయనకు నోబెల్ బహుమతి ప్రతిపాదన చేసింది.












Click it and Unblock the Notifications